తెలుగు ఇండియన్ ఐడల్ షో (Telugu Indian Idol).. రోజు రోజూకీ ప్రేక్షకాదరణ పెరుగుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా మూడవ ఎపిసోడ్ ఆహాలో (Aha) స్ట్రీమింగ్ అవుతుంది. తాజా ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం..
ముందుగా వెంకీ మామా సినిమాలోని కోకో కోలా పెప్సీ పాటతో పాపులర్ అయిన ప్రొఫెషనల్ సింగర్ అదితి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ముందు ఆమె.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వ్యక్తిగత బృందంలో పనిచేసేది. ఇప్పటికే ప్రొఫెషనల్ సింగర్‌గా ఉన్న అదితి.. ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇండియన్ ఐడల్ తెలుగు షోలోకి ఎంట్రీ ఇచ్చింది. మరోసారి కోకో కోలా పెప్సీ పాట పాడి గోల్డెన్ మైక్ అందుకుంది.
ఆ తర్వాత జస్కరన్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇతరు తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనడానికి పంజాబ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అల్లు అర్జున్ సినిమాలో సాంగ్ పాడాలన్నది జస్కరన్ కల. బన్నీ నటించిన అల వైకుంఠపురంలో నుంచి సామజవరగమన పాట పాడి గోల్డెన్ టికెట్ అందుకున్నాడు. ఇక మూడవ కంటెస్టెంట్‌గా.. మాలోత్ కార్తీక ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ల కార్తీక.. మనసున ఎదో రాగం పాట పాడగా.. ఆమెకు మరింత ప్రాక్టీస్ అవసరమని సెలక్ట్ చేయలేదు. ఈమె తర్వాత మరికొందరు పాల్గోనగా వారిని ఎంచుకోలేదు.
ఆ తర్వాత విజయవాడకు చెందిన చంద్రకిషన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి మానస.. మానస పాట ఆకట్టుకున్నాడు. చంద్రకిషన్ పాడుతున్న సమయంలో జడ్జీస్ అతనిపై పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత.. తెనాలికి చెందిన హర్షవర్దన్.. తీన్మార్ సినిమాలోని గెలుపు తలుపులే పాట పాడి గోల్డెన్ టికెట్ అందుకున్నాడు. ఇతడు తన గురువు తన తల్లి అని పరిచయం చేయడం ఆకట్టుకుంది. తిరుపతికి చెందిన రేణు కుమార్ శ్రీవల్లి పాటను ఆలపించాడు. అయితే ఇతనికి థమన్ అభ్యంతరం తెలుపగా.. కార్తీక్, నిత్యామీనన్ గోల్డెన్ టికెట్ ఇచ్చారు.