Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక పెద్ద సునామీ రాబోతోంది. సాధారణంగా సీనియర్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టమనుకుంటారు. కానీ ఈ టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ మాత్రం కుర్ర హీరోలకు సైతం సవాల్ విసురుతూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు.

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ఆయన రూటే మారిపోయింది. కేవలం రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కంటెంట్ ఉన్న వైవిధ్యమైన కథలకు ఓకే చెబుతూ వరుస హిట్లు అందుకుంటున్నారు. గతేడాది మొదట్లో ‘డాకు మహారాజ్’గా అలరించి, చివర్లో ‘అఖండ 2’తో థియేటర్లలో శివతాండవం చేయించారు. అయితే ఇప్పుడు అసలు సిసలైన వార్త ఏంటంటే.. ఈ నటసింహం ఏకంగా అరడజను మంది అగ్ర దర్శకులను లైన్లో పెట్టారు. ఆ సినిమాలు ఏంటి? ఎవరెవరి దర్శకత్వంలో ఇవి రాబోతున్నాయి?
గోపీచంద్ మలినేనితో క్రేజీ కాంబో..
‘అఖండ 2’ తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి వీరు సిద్ధమయ్యారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా, సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన పక్కా మాస్ స్టోరీతో తెరకెక్కనుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.
అనిల్ రావిపూడి & క్రిష్‌లతో ..
‘భగవంత్ కేసరి’లో బాలయ్యను ఒక కొత్త కోణంలో చూపించిన అనిల్ రావిపూడి, మరోసారి ఆయన కోసం ఒక పవర్ ఫుల్ పాత్రను సిద్ధం చేశారు. సాహు గారపాటి నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘ఆదిత్య 999 మాక్స్’ బాధ్యతలను క్రిష్ చేపట్టబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ చేయకముందే బాలయ్యతో ఒక భారీ మాస్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది నందమూరి అభిమానులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. అలాగే ‘డాకు మహారాజ్’తో హిట్ ఇచ్చిన బాబీ కొల్లితో కూడా బాలయ్య మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించబోతున్నారు.
దిల్ రాజు బ్యానర్‌లో తొలిసారి..
ఎందరో కొత్త నిర్మాతలకు లైఫ్ ఇచ్చిన బాలయ్య, ఇప్పటివరకు అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో నటించలేదు. తాజాగా ఈ లోటు తీరబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడితో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అరడజను సినిమాలతో బాలయ్య తన డైరీని ఫుల్ చేసేశారు. ఈ లైనప్ చూస్తుంటే రాబోయే రెండేళ్లు బాక్సాఫీస్ వద్ద నందమూరి నామస్మరణే వినిపించేలా ఉంది.
