మా నాన్నను చూసి మేము భయపడేవాళ్లం.. ఆడియన్స్ కోసమే ఆపరేషన్ చేయించుకోలేదు: కళ్లు చిదంబరం కూతురు
సినిమా ఇండస్ట్రీలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు నటుడు కళ్లు చిదంబరం. దాదాపు 300సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు చిదంబరం. మెల్ల కన్నుతో విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వులు పూయించారు చిదంబరం . ఇప్పటికీ ఆయన సినిమా వస్తే ప్రేక్షకులను హాయిగా నవ్వుతుంటారు.

తెలుగు సినిమాల్లో ఎంతో మంది కమెడియన్స్ తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. వారిలో కళ్ళు చిదంబరం ఒకరు. కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. ఆయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందారు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు కళ్లు చిదంబరం. కళ్లు, అమ్మోరు, చంటి, గోల్‌మాల్ గోవిందం, మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల హిట్ సినిమాల్లో నటించారు.
కాగా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 న కన్నుమూశారు. గతంలో కళ్లు చిదంబరం కూతురు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. చిదంబరం గారు తన కళ్ళతో హాస్యాన్ని, సస్పెన్స్‌ను పండించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారని, తన తండ్రికి కుమార్తెగా పుట్టినందుకు తాను అదృష్టవంతురాలిని అని ఆమె అన్నారు. చిదంబరం గారు తన కోసం కాకుండా సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉండేవారని తెలిపారు. అందుకే కంటి సమస్య ఉన్నప్పటికీ, తన నటనతో పదిమందికి ఆనందం పంచడానికే ప్రాధాన్యత ఇచ్చి, ఆపరేషన్ వాయిదా వేసుకున్నారని కళ్లు చిదంబరం కూతరు సులక్షణ తెలిపారు. తన వలన పది మంది ఆనందిస్తే అది స్వార్థం కాదని, తన ఆనందం కోసం ఒక్కడినే కన్ను బాగు చేయించుకుంటే అది స్వార్థం అవుతుందని ఆయన నమ్మేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.
చిదంబరం గారి సినీ జీవితంలో అమ్మోరు సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని సులక్షణ తెలిపారు. ఆ చిత్రంలోని చివరి సన్నివేశంలో ఆయన నటన హైలైట్‌గా నిలిచిందని, సౌందర్య గారికి బొట్టు పెట్టమని గుర్తుచేయడం ఆ సన్నివేశానికి ప్రాణం పోసిందని ఆమె వివరించారు. చిన్నతనంలో అమ్మోరు, కళ్ళు సినిమాల్లో మేకప్‌తో ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి భయపడిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. కళ్ళు చిత్రం తన తండ్రికి తొలి సినిమా కావడం, దానికి దివంగత ఎన్.టి.ఆర్. చేతుల మీదుగా నంది అవార్డు అందుకోవడం ఒక గొప్ప విశేషమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. హాస్య పాత్రల విషయానికి వస్తే, ఒట్టేసి చెప్తున్నా చిత్రంలోని అమాయకపు బ్యాంక్ లోన్ సన్నివేశం, ఏప్రిల్ 1 విడుదల చిత్రంలోని మాట్లాడే మేక సీన్ తన తండ్రి హాస్యాన్ని పండించిన తీరుకు ఉదాహరణలని సులక్షణ తెలిపారు. పర్సనల్ లైఫ్‌లో తన తండ్రి కఠినంగా ఉండేవారని, అయితే అది తమ మంచి కోసమేనని ఇప్పుడు తల్లిదండ్రులుగా అర్థమవుతోందని చెప్పారు. ఆయనకు మడి, తడి, ఆచారం వంటి సంప్రదాయాలు ఎక్కువగా ఉండేవని, ఆడపిల్లల విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వ్యత్యాసం చూపేవారు కాదని ఆమె వివరించారు. నాటకాలు వేసిన రోజుల్లో అర్ధరాత్రి అతిథులతో ఇంటికి వచ్చినా, తన తల్లి ఎప్పుడూ అసహనం చూపకుండా భోజనం వండిపెట్టేవారని, ఆమె సహనం, మద్దతు లేకుంటే తన తండ్రి సినీ రంగంలోకి వచ్చేవారు కాదని ఆమె అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
