AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bison Movie: బైసన్ మూవీ రివ్యూ.. విక్రమ్ తనయుడు తెలుగులో హిట్టుకొట్టాడా.. ?

విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం దివాళికి తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేసారు. మరి మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Bison Movie: బైసన్ మూవీ రివ్యూ.. విక్రమ్ తనయుడు తెలుగులో హిట్టుకొట్టాడా.. ?
Bision Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: Oct 24, 2025 | 1:19 PM

Share

మూవీ రివ్యూ: బైసన్

నటీనటులు: ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, అమీర్ సుల్తాన్, లాల్ తదితరులు

ఎడిటర్: శక్తి తిరు

సంగీతం: నివాస్ కె. ప్రసన్న

సినిమాటోగ్రఫర్: ఎజిల్ అరసు కె

నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా రంజిత్, అదితి ఆనంద్

దర్శకుడు: మారి సెల్వరాజ్

విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం దివాళికి తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేసారు. మరి మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

1990లలో సాగే కథ ఇది. వణతి కిట్టయ్య (ధృవ్ విక్రమ్) కు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం. ఆ ఊళ్లో ఉండే ప్రతి ఒక్కడు కబడ్డి ఆడాలనుకుంటాడు. కానీ తన కొడుకు భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశ్యంతో అతడి తండ్రి వేలుసామి (పశుపతి) కిట్టయ్యను కబడ్డీ వైపు పోనివ్వడు.. ఆడొద్దని ఒట్టు తీసుకుంటాడు. దానికి కారణం అదే గ్రామంలో కులవివక్ష ఎక్కువగా ఉండడమే. కిట్టయ్యను కచ్చితంగా కబడ్డీ పేరుతో ఏదో ఒకటి చేస్తారని భయపడుతుంటాడు వేలు స్వామి. ఇదే సమయంలో ఓ వైపు రెండు వర్గాల కోసం పోరు సాగిస్తుంటారు పాండ్యరాజ్ (అమీర్ సుల్తాన్), కందసామి (లాల్). ఓ సమయంలో కిట్టయ్యకు తన వర్గం కాని కందసామి సపోర్ట్ చేస్తాడు. అక్కడ్నుంచి కిట్టయ్య జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. వీళ్ల మధ్యలోకి రాణి (అనుపమ పరమేశ్వరన్) ఎలా వచ్చింది.. రాజీ (రాజీషా విజయన్) ఎవరు అనేది కథ..

కథనం:

బైసన్ చిత్రం అర్జున అవార్డు గ్రహీత, కబడ్డీ క్రీడాకారుడు మణతి గణేశన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఒక యువ కబడ్డీ ఆటగాడి ఆశయాల చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న గ్రామంలో పుట్టిన కిట్టయ్య, తన ప్రతిభతో జాతీయ స్థాయిలో కబడ్డీ ఛాంపియన్‌గా ఎదగాలని కలలు కంటాడు. అయితే అతని ఈ క్రీడా ప్రయాణంలో సామాజిక అణచివేత, కుల వైరుధ్యాలు, రాజకీయ ఒత్తిళ్లు వంటి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. సమాజంలోని అసమానతలను, అన్యాయాలను ఎదిరించి, తన కల కోసం కిట్టయ్య చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. చాలా సింపుల్ లైన్ తీసుకున్నా కూడా దాన్ని చాలా బాగా ఎగ్జిగ్యూట్ చేసాడు దర్శకుడు మారి. స్క్రీన్ ప్లేను తనదైన శైలిని కొనసాగిస్తూ.. ఒక గ్రిప్పింగ్ స్పోర్ట్స్ డ్రామాకు అవసరమైన అంశాలను సామాజిక ఇతివృత్తంతో బ్యాలెన్స్ చేసాడు. సామాజిక సమస్యలు, అణచివేత వంటి అంశాలను చర్చించడంలో దర్శకుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన గత సినిమాలు కర్ణణ్, మామన్నన్‌లోనూ ఇలాంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. కథనం చాలావరకు ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మొదటి భాగం ఉత్కంఠభరితంగా ఉంటుంది.. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై అంచనాలను బాగా పెంచుతుంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా.. చాలా వరకు మెప్పించేలాగే ఉంటుంది. ముఖ్యంగా పాండ్యరాజ్, కందసామి క్యారెక్టరైజేషన్స్ మారి రాసుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఎవరూ చెడ్డోళ్లు కాదు.. పరిస్థితులు వాళ్లను అలా మార్చేస్తుంటాయని చూపించాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామాలో ఎదురయ్యే అన్ని అవాంతరాలు ఇందులో చూపించాడు. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడమే మైనస్. ప్రతీచోట హీరో తప్ప ఇంకెవరూ కనిపించరు.

నటీనటులు:

కిట్టయ్య పాత్రలో ధృవ్ విక్రమ్ తన నటనతో అదరగొట్టాడు. కబడ్డీ ఆటగాడిగా మారడానికి కావలసిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్‌ను అతడు అద్భుతంగా చూపించాడు. కిట్టయ్య పాత్రలోని ఆవేశాన్ని, ఎమోషనల్ బ్యాలెన్స్ స్క్రీన్‌పై చూపించడంలో ధృవ్ విజయం సాధించాడు, ఇది అతని కెరీర్‌లో ఒక బలమైన అడుగు. సీనియర్ నటుడు పశుపతి అద్బుతం. కిట్టయ్య తండ్రిగా ఆయన నటన చాలా బాగుంది. తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాలు బాగున్నాయి. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో పర్వాలేదనిపించింది. తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది ఈమెకు. రాజిషా విజయన్ పర్లేదు.. అమీర్ సుల్తాన్, లాల్ సహా ఇతర నటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ టీం:

సాంకేతిక విభాగం పనితీరు ఈ సినిమా స్థాయిని పెంచింది. నివాస్ కె. ప్రసన్న అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర్ కీలకం. ఈ విషయంలో ప్రసన్న విజయం సాధించాడు. కబడ్డీ మ్యాచ్‌లలో, గ్రామీణ నేపథ్యాన్ని ఎలివేట్ చేయడంలో ఎజిల్ అరుసు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. శక్తి తిరు ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది. పా రంజిత్ నేతృత్వంలోని నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు మారి సెల్వరాజ్ మరోసారి మ్యాజిక్ చేసాడు. సింపుల్ కథను సరైన స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బైసన్.. చూడదగ్గ స్పోర్ట్స్ డ్రామా..!