Chiranjeeva Movie: రాజ్ తరుణ్ చిరంజీవ మూవీ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే
రాజ్ తరుణ్, కుషిత కల్లపు జంటగా నటించిన చిత్రం చిరంజీవ. ఈ సినమా ఆహాలో నేరుగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాతో జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. కంటెంట్‌పై నమ్మకంతో మూడ్రోజుల ముందుగానే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేసారు. మరి అక్కడ్నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం..

మూవీ రివ్యూ: చిరంజీవ
నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు, కిరీటి, రాజా రవీంద్ర, సంజయ్ కృష్ణ, గడ్డం నవీన్, టేస్టీ తేజ తదితరులు
సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ్
ఎడిటర్: సాయి మురళి
సంగీతం: అచ్చు రాజమణి
నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్
స్ట్రీమింగ్ పార్ట్‌నర్: ఆహా
దర్శకుడు: అభినయ్ కృష్ణ
కథ:
రాజ్ తరుణ్ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఆయనకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం ఉండదు. రోజూ పేషెంట్స్‌ను చూస్తుంటాడు. అదే సమయంలో ఓరోజు హాస్పిటల్‌కు వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఓ దున్నపోతును గుద్దేస్తాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక తెలియకుండానే కొన్ని శక్తులు వస్తాయి. వాటితో ఎదుటి వారి ఆయుష్షు కనిపిస్తుంది. ఆ పవర్ వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు రాజ్. మరోవైపు అతడితో ప్రేమలో పడుతుంది కుషిత కల్లపు. అదే ఏరియాలో ఉండే సంజయ్ కృష్ణ అలియాస్ సత్తు పహిల్వాన్ దగ్గరికి వెళ్లి ఓ డీల్ మాట్లాడుకుంటాడు. మరోవైపు ఆ ఏరియా ఎమ్మెల్యే రాజా రవీంద్రను సైతం తన పవర్‌తో బురిడీ కొట్టిస్తాడు. అసలు రాజ్ తరుణ్ ఈ ఆయుష్షు చూసే పవర్‌తో ఏం చేసాడు అనేది మిగిలిన కథ..
కథనం:
మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలిస్తే అంతకంటే భయం మరోటి ఉంటుందా..? సరిగ్గా అలాంటి ఐడియానే తీసుకున్నాడు దర్శకుడు అభినయ కృష్ణ ఈ చిరంజీవ సినిమా కోసం. హీరోకు ఎదుటివారి ఆయుష్షు చూసే శక్తులు వస్తాయి. ఐడియా వినడానికి ఆసక్తికరంగా ఉంది. దాని చుట్టూనే కథ అల్లుకున్నాడు అభి. చావు కనబడటం.. ఎదుటివాళ్ల మరణాన్ని డిసైడ్ చేయడం అనేదే ఓ పెద్ద వరం లాంటి శాపం. దాన్ని హీరో వాడుకున్న విధానాన్ని చాలా వరకు ఫన్నీ పద్దతిలోనే చెప్పే ప్రయత్నం చేసాడు అభి. హీరోకు పవర్ వచ్చిందని తెలియడానికి అరగంట పడుతుంది.. అక్కడ్నుంచి దాని చుట్టూనే కథనం అల్లుకున్నాడు. చుట్టూ ఉండే మనుషులు, వాళ్లతో ఉండే అనుబంధం, కొన్నిసార్లు అందులోంచి వచ్చే సిచ్యువేషనల్ కామెడీ ఇవన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్ అంతా సరదాగానే రాసుకున్నాడు. సెకండాఫ్‌లో అక్కడక్కడా సీరియస్ సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా పిల్లలను కాపాడే సీన్, దానికి ముందు వచ్చే కిరీటి సీన్స్ బాగానే ఉన్నాయి. కొన్ని లోపాలున్నా.. ఓటిటి కాబట్టి సర్దుకోవచ్చు. క్లైమాక్స్ అసంపూర్తిగా అనిపిస్తుంది.
నటీనటులు:
రాజ్ తరుణ్ మంచి ఈజ్‌తో నటించాడు.. సరదాగా ఉండటమే కాదు ఎనర్జీగా కనిపించాడు స్క్రీన్ మీద. కుషిత కల్లపు నటన బాగుంది. రాజా రవీంద్ర మంచి పాత్రలో మెప్పించాడు. సంజయ్ కృష్ణ, కిరీటీ, గడ్డం నవీన్ ఇలా ఎవరికి వాళ్లు తమ పాత్రల్లో మెప్పించారు.
టెక్నికల్ టీం:
అచ్చు రాజమణి ఇచ్చిన సంగీతం పర్లేదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఎడిటింగ్ షార్ప్‌గానే కట్ చేసారు. సినిమా నిడివి 1.50 గంటలకు మించి లేదు. సినిమాటోగ్రఫీ కూడా బడ్జెట్‌కు తగ్గట్లుగానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా అభినయ కృష్ణ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా కొత్త ప్రయత్నం అయితే చేసాడు. ఐడియా వరకు చాలా ఆసక్తికరంగా ఉంది చిరంజీవ. ఆహాలో మంచి ప్రాడక్ట్ వచ్చిందని చెప్పొచ్చు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా చిరంజీవ.. ఇంట్రెస్టింగ్ మిస్టికల్ ఎంటర్‌టైనర్..!




