Mimi Movie Review: మిమి.. భావోద్వేగ మిళితం.. మాతృత్వాన్ని మొక్కుతాం..
Mimi Movie Review: సినీ వినీలాకాశంలో తారలా వెలిగిపోవాలని కలలు కనే సగటు అమ్మాయి మిమి పాత్రలో ఒదిగిపోయింది కృతిసనన్. కేవలం గ్లామర్‌డాళ్‌గానే కాదు అవకాశమొస్తే ఆకాశమే హద్దుగా..
(SK ఇమాం షఫీ, TV9 తెలుగు, హైదరాబాద్)
సరోగసీ… అద్దెకు తల్లుల గర్భాలని అవహేళనగా మాట్లాడేవాళ్లున్నారు. మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకుని.. వారిని పిల్లలు కనే యంత్రాలుగా మార్చేశారని ఆవేదన పడేవాళ్లున్నారు. కానీ కేవలం నోట్ల కట్టలకోసం ఎవరి కణాన్నో నవమాసాలు కడుపులో మోసేటప్పుడు, ఆ బిడ్డ పుట్టాక తన పొత్తిళ్లలో చూసుకున్నప్పుడు అమ్మ మనసు అల్లాడుతుంది. పేగుబంధం తనదికాదని తెలిసినా తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. సరోగసి అమ్మలని ఆ జ్ఞాపకం జీవితాంతం వెంటాడుతుంటుంది. సరోగసి థీమ్‌తో అత్యంత హృద్యంగా కథనాన్ని అల్లుకున్నాడు మిమి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.
సినీ వినీలాకాశంలో తారలా వెలిగిపోవాలని కలలు కనే సగటు అమ్మాయి మిమి పాత్రలో ఒదిగిపోయింది కృతిసనన్. కేవలం గ్లామర్‌డాళ్‌గానే కాదు అవకాశమొస్తే ఆకాశమే హద్దుగా తన నట విశ్వరూపాన్ని చూపించగలనని మరోసారి ప్రూవ్ చేసుకుందీ టాలెంటెడ్ హీరోయిన్. సిన్మాలో హీరోలేడు. స్టెప్పుల్లేవు. అందాల ఆరబోత లేదు. డబల్ మీనింగ్‌లు లేవు. వెగటు కామెడీ లేదు. మిమి సిన్మాకి కథనాయికే సర్వం. సంతానయోగం లేని అమెరికన్ దంపతులు సరోగసి కోసం ఇండియాకొస్తారు. టాక్సీ డ్రైవర్ భాను ద్వారా మిమిని అప్రోచ్ అవుతారు.
నటిగా ఎదిగేందుకు అందం, అభినయం మాత్రమే సరిపోవు. తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటూనే కుటుంబానికి అండగా నిలిచేందుకు డబ్బుకావాలి. అందుకే సరోగసికి ఒప్పుకుంటుంది. సంప్రదాయిక కుటుంబంలో తల్లిదండ్రులు దీనికి ఒప్పుకునే అవకాశమే లేకపోవటంతో… బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందని తొమ్మిది నెలలు ఫ్రెండ్ షమా ఇంట్లో ఉంటుంది. ముస్లింగా, డ్రైవరే భర్తగా అక్కడుంటుంది.
డెలివరీ డేట్‌కల్లా నాటకీయ పరిణామాలు జరిగిపోతాయి. పుట్టేబిడ్డలో శారీరకవైకల్యం ఉందన్న డాక్టర్ మాటలతో అమెరికా జంట స్వదేశానికి వెళ్లిపోతుంది. దీంతో బిడ్డనేం చేయాలో తెలీక, తండ్రెవరో చెప్పలేక, తల్లిదండ్రులను ఒప్పించలేక మిమి సంఘర్షణ అంతా ఇంతా కాదు. డ్రైవరే తన భర్తని చెబుతుంది. అతని తల్లి, మొదటి భార్య ఎంట్రీతో నిజం బయటికొస్తుంది. ఆ నిజాన్ని మిమి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయినా పిల్లాడి బోసినవ్వులు, బుడిబుడి నడకలు ఆ ఇంట్లో వెలుగులు నింపుతాయి. మిమి, ఆమె తల్లిదండ్రులకు ఆ చిన్నారే సర్వస్వం.
కాలం గడిచేకొద్దీ ఆ ఇంటిదీపంగా మారిపోతాడు రాజ్. తనను తెల్ల దెయ్యం అంటున్నారంటూ ఆ పిల్లాడు చెబితే…చందమామ కానుకగా ఇచ్చిన తారాజువ్వవంటూ ఆకాశానికేసి చూపిస్తూ గుండెలకు హత్తుకుంటుంది తల్లి కాని తల్లి. రాజ్‌కి నాలుగేళ్లు వచ్చేసరికి సడెన్‌గా ప్రత్యక్షమవుతారు టెక్నికల్ పేరెంట్స్. తమ పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడనీ, సరోగసీ మదర్ ఇంట్లోనే పెరుగుతున్నాడని ఫేస్‌బుక్ పోస్టింగ్‌తో తెలిసి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఆ పిల్లాడ్ని చూసి మురిసిపోతారు. కానీ వద్దని వెళ్లిపోయిన మీకు పిల్లాడి మీద ఎలాంటి హక్కూ లేదంటుంది మిమి. తల్లిదండ్రులు కూతురికే మద్దతు పలుకుతారు. చివరికి డీల్ కుదిర్చి ఆ ఫ్యామిలీకి దగ్గరైన డ్రైవర్‌దీ అదే మాట. నీకు తల్లి అయ్యే అవకాశం ఉంది, నాకా భాగ్యం లేదని కన్నీటిపర్యంతమవుతుంది అమెరికా నుంచి వచ్చిన సమ్మర్.
తమ బిడ్డని ఇచ్చేయమని ప్రాథేయపడుతూనే… తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని కూడా చెబుతాడు సమ్మర్ భర్త జాన్. అయినా వినకపోయేసరికి లీగల్‌గా వెళ్తానని వార్నింగిస్తాడు. దీంతో రాజ్ కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతారు మిమి కుటుంబం. కానీ చిన్నారి కూడా కోర్టు గుమ్మం ఎక్కాల్సి వస్తుందని, న్యాయపోరాటం చేసినా సాంకేతికంగా రాజ్ మీద హక్కు అమెరికన్ దంపతులదేనని తెలిసి మిమి మథనపడుతుంది. కుమిలిపోతుంది. చివరికి బిడ్డని తిరిగిచ్చేసేందుకు సిద్ధపడుతుంది.
మొదట్లో కూతురి గర్భంతో తలపట్టుకున్న తల్లిదండ్రులకు కొన్నాళ్లకి ఆ పిల్లాడే సర్వస్వమైపోయాడు. ఆ చిన్నారితో ఆడుకుంటూ తాత పసిపిల్లాడైపోతాడు. కూతురు రాజ్‌ని వదులుకునేందుకు సిద్ధపడ్డా తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతారు, బాధనంతా గుండెల్లో దాచుకుని ఆటబొమ్మల్ని బుట్టలో సర్దుతుంటే ఓ బొమ్మని తన వెనుక దాచుకుంటూ నేనివ్వనని మారాం చేస్తాడు మిమి తండ్రి. మనవడి జ్ఞాపకంగా అదన్నా తనతో ఉండనివ్వమని కళ్లతోనే ప్రాథేయపడతాడు.
చివరికి రాజ్‌ని అమెరికన్ దంపతులికిచ్చేందుకు మిమి కుటుంబమంతా వెళ్లినప్పుడు చరమాంక భావోద్వేగంతో సిన్మాని మరింత రక్తి కట్టించాడు దర్శకుడు. రాజ్‌తో మిమి కుటుంబ అనుబంధాన్ని చూశాక జాన్, సమ్మర్ మనసు మార్చుకుంటారు. మిమి కుటుంబం భావోద్వేగాల్ని అర్ధంచేసుకుంటారు. తమ బిడ్డ మిమి కుటుంబంలో ప్రేమానురాగాల మధ్య పెరుగుతాడని తెలుసుకుంటారు. రాజ్ తల్లివి నువ్వేనని సమ్మర్ చెబుతున్న సమయంలో… దత్తత తీసుకున్న మరో చిన్నారిని ఎత్తుకుని మెట్లు దిగుతాడు జాన్. మాతృత్వపు మమకారానికి ఆకాశమే హద్దని చాటుతుందా సన్నివేశం.
కృతిసనన్ నటించిందని చెప్పేకంటే జీవించేసిందనడమే కరెక్ట్. ఇక సంప్రదాయిక పరదాల మధ్య ఉండే రాజస్థాన్‌లో కూతురి అనుభవాలతో సంఘర్షణ పడే సగటు తల్లిదండ్రులుగా మనోజ్ పాహ్వా, సుప్రియా పాథక్ పాత్రలకు ప్రాణంపోశారు. విలనిజాన్ని విరుపునవ్వుతో పండించే పంకజ్ త్రిపాఠి… మిమి సిన్మాలో కీలక పాత్రధారి. కమీషన్ వస్తుందని సరోగసికి ఒప్పించే ట్యాక్సీ డ్రైవర్ చివరికి ఆమెకు భర్తగా నటించి, ఆ కుటుంబానికి సన్నిహితుడిగా మారి, చివరికి ఆమె భావోద్వేగాల్ని కూడా పంచుకుంటాడు. ఈ కేరక్టర్‌కి ఫెవిక్విక్‌తో అతికిచ్చినట్లు సెట్ అయ్యాడు పంకజ్. ప్రతీ భావాన్నీ, సన్నివేశాన్నీ జాగ్రత్తగా ఒడిసిపట్టి భావోద్వేగభరితంగా మలచడంలో డైరెక్టర్ సక్సెసయ్యాడు. టెక్నికల్‌గా కూడా అన్నీ చక్కగా సెట్ కావటంతో ఫీల్‌గుడ్ మూవీగా ఉంది మిమి. ఒక్కటి మాత్రం నిజం.. సరోగసి తల్లుల మీద ఈ సిన్మా చూశాక సానుభూతే కాదు గౌరవం కూడా పెరుగుతుంది.
Also Read..
Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు పండగే.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
పూజా కిట్టీలో క్రేజీ ఆఫర్.. మరో స్టార్‌హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్న బుట్టబొమ్మ
Netrikann Trailer: క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ‘నేత్రికన్’.. ఆకట్టుకొంటున్న ట్రైలర్..