ప్రముఖ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్ (Vidya Sagar) హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు తోడు పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతోన్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా మీనా కుటుంబం పోషిస్తోన్న పావురాల కారణంగానే విద్యాసాగర్ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారంటూ, శ్వాససంబంధిత సమస్యలు తలెత్తి విద్యాసాగర్ మృతి చెందారంటూ కోలీవుడ్ వర్గాలు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ (Kala Master) స్పందించారు.
ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు..
‘విద్యాసాగర్ చాలా మంచి మనిషి. ఆయన ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. సినిమా రంగంలో మీనా విజయవంతమవ్వడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అయితే ఇలాంటి చేదువార్త వినాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు. కొవిడ్ బారిన పడకముందు విద్యాసాగర్‌కు బర్డ్ ఇన్‌ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ తర్వాత, ఈ ఏడాది జనవరిలో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. మీనా తల్లి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఫిబ్రవరిలో మేం కలిశాం. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. మార్చిలో ఓసారి మీనా ఫోన్ చేసి .. ‘సాగర్ ఆరోగ్యం బాగోలేదు’ అని చెప్పింది. వెంటనే నేను ఆస్పత్రికి వెళ్లి ఆయనను పలకరించాను. ఆ రోజు నా పుట్టిన రోజు కావడంతో సాగర్ నాకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అప్పుడూ ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అయితే ఏప్రిల్‌లో పరిస్థితి దిగజారింది. సాగర్ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని, వెంటనే లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు తెలిపారు. దాతల కోసం మూడు నెలలు ప్రయత్నించాం. ఈ విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సహాయం కోరాం. అంతా హెల్ప్ చేశారు కానీ అవయవాలు లభించలేదు. మరోవైపు రోజురోజుకూ సాగర్ ఆరోగ్యం క్షీణించింది. కన్నుమూసే వరకూ సాగర్ ఎంతో ధైర్యంగా ఉన్నారు. తన భర్తను కాపాడుకునేందుకు మీనా శతవిధాలా ప్రయత్నించింది. చిన్న వయసులోనే సాగర్ మరణించడం చాలా బాధకరం. ఆయన్ను మిస్ అవుతున్నాం’ అని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..