Krishna Vamsi : బ్రహ్మనందంతో రిస్క్ చేశా.. అందరూ వద్దు అన్నారు.. కట్ చేస్తే.. థియేటర్లను షేక్ చేసిన సినిమా అది..
దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను, అందమైన కథలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత విషయాలు, సినీ ప్రయాణం గురించి వెల్లడిస్తుంటారు.

దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు బ్రహ్మానందంను రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో ఎంపిక చేయడం వెనుక ఉన్న తన ప్రత్యేక ఆలోచన.. అందుకు గల కారణాలను వివరించారు. బ్రహ్మానందంను చక్రి అనే పాత్రలో తీసుకునే సమయంలో, తన గురువులు, సీతారామశాస్త్రి గారు వంటి వారు సహా చాలా మంది వద్దని సలహా ఇచ్చారని కృష్ణవంశీ వెల్లడించారు. బ్రహ్మానందంని సీరియస్ పాత్రలో చూసినప్పుడు ప్రేక్షకులు నవ్వకపోతే అది సినిమాకు ప్రమాదమని వారు హెచ్చరించారని అన్నారు. అయితే, తనకు బ్రహ్మానందంపై లోతైన నమ్మకం ఉందని.. ఆయన వ్యక్తిత్వాన్ని చాలా దగ్గరగా చూశానని, ఆయనకున్న జ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం, తత్వశాస్త్రంపై అవగాహన, ఆయన బహుముఖ ప్రజ్ఞ తనకు తెలుసని కృష్ణవంశీ తెలిపారు.
గత నలభై సంవత్సరాలుగా తరాలన్నింటికీ బ్రహ్మానందంతో ఒక బ్రహ్మాండమైన అనుబంధం ఉందని, ఆయన సినిమాలు తగ్గినప్పటికీ, మీమ్స్ రూపంలో ప్రతిరోజూ ప్రజలతో ఆయన కనెక్ట్ అవుతున్నారని కృష్ణవంశీ అన్నారు. బ్రహ్మానందం గారిని చూడగానే నవ్వు వస్తుందనే సాధారణ భావనకు మించి, ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిగా, మనోడు అనిపించేలా చూడాలనేది తన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ వంటి శక్తివంతమైన నటుడి పక్కన బ్రహ్మానందం గారుండాలని, ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించే, “నువ్వు ఒక చెత్త నటుడివి రా” అని చెప్పే, “నాకు ముక్తిని ప్రసాదించు రా” అని బతిమాలే, తన భార్య గురించి ఏడుస్తూ బాధపడే పాత్రకు ఆయన సరిపోతారని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఆయన రెగ్యులర్ సినిమాల్లో కనిపించే కామెడీ విజువల్ నరేషన్ నుంచి పూర్తిగా దూరం వెళ్లి, వేరే రకంగా ఈ పాత్రను సిద్ధం చేశానని కృష్ణవంశీ స్పష్టం చేశారు.
ఈ సినిమా తర్వాత బ్రహ్మానందంను చూసే కోణం ఖచ్చితంగా మారుతుందని కృష్ణవంశీ ఆశాభావం వ్యక్తం చేశారు. హాస్య పాత్రలకు మించి ఆయన వేరే రకమైన పాత్రలను కూడా చేయగలరని, అలాంటి వాటిని ధైర్యంగా చేయవచ్చని కృష్ణవంశీ అన్నారు. బ్రహ్మానందం గారిలో ఒక బ్రహ్మాండమైన నటుడు ఉన్నాడని, అయితే దర్శకులు జాగ్రత్తగా ఆ కోణాన్ని పట్టుకోవాలని ఆయన చెప్పారు. ఇతర దర్శకులు ఎందుకు ఈ కోణంలో చూడలేకపోయారనే ప్రశ్నకు కృష్ణవంశీ రెండు కారణాలు చెప్పారు. ఒకటి, బ్రహ్మానందంకి ఉన్న బలమైన కామెడీ ఇమేజ్, దాన్ని పాడుచేసుకోవడం ఎందుకని భావించడం. రెండు, దర్శకుడి స్వార్థం, వ్యాపార కోణం. ఇలాంటి రిస్క్ తీసుకుంటే నిర్మాతతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నష్టం జరుగుతుందనే భయం కూడా ఉంటుందని కృష్ణవంశీ వివరించారు.
మరుధూరి రాజా గారు అధ్యక్ష సినిమాలో బ్రహ్మానందంతో ఒక సీరియస్ పాత్ర చేయించారని, అయితే ఇతర కారణాల వల్ల సినిమా పోతే, బ్రహ్మానందం గారి వల్లే పోయిందని బయట విమర్శ వస్తుందని, దానిని తొందరగా ఎవరూ గుర్తించరని కృష్ణవంశీ పేర్కొన్నారు. అయితే, తాను ఈ రిస్క్‌కు సిద్ధపడ్డానని అన్నారు. కట్ చేస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..
