Valentines Week: తండ్రి పంతంతో ప్రేమ మాత్రమే కాదు 36 ఏళ్లకే జీవితం అంతం.. మధుబాల విషాద ప్రేమ కథ మీకు తెలుసా..

సినీ పరిశ్రమలో అనేక ప్రేమలు.. విఫలమయ్యాయి.. నేటికీ వారి ప్రేమ కథలుగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్.. అలనాటి అందాల సుందరి మధుబాల ప్రేమ కథ.. వీరిద్దరూ ఒకరినొకరు చాలా గాఢంగా  ప్రేమించుకున్నారు. ఈ వాలెంటైన్స్ వీక్‌లో దిలీప్ కుమార్ , మధుబాల ప్రేమకథ గురించి తెలుసుకుందాం.

Valentines Week: తండ్రి పంతంతో ప్రేమ మాత్రమే కాదు 36 ఏళ్లకే జీవితం అంతం.. మధుబాల విషాద ప్రేమ కథ మీకు తెలుసా..
Dilip Kumar Madhubala Love Story
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2023 | 12:58 PM

ప్రేమికుల రోజు రానున్న నేపథ్యంలో చాలామంది హృదయాల్లో అలనాటి మేటి ప్రేమికులు మదిలో మెదులుతున్నారు. ఈ వాలెంటైన్స్ వీక్‌లో దిలీప్ కుమార్ , మధుబాల ప్రేమకథ గురించి తెలుసుకుందాం. నేల రాలినా వాడిపోనిది నిజమైన ప్రేమ.. ఇది పాటలోని సాహిత్యం మాత్రమే కాదు వాస్తవం. ఎందుకంటే అసంపూర్ణంగా మిగిలిపోయిన నిజమైన ప్రేమ కథలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అనేక ప్రేమలు.. విఫలమయ్యాయి.. నేటికీ వారి ప్రేమ కథలుగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్.. అలనాటి అందాల సుందరి మధుబాల ప్రేమ కథ.. వీరిద్దరూ ఒకరినొకరు చాలా గాఢంగా  ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమ ఎంత గొప్పదంటే.. నేటికీ వీరి ప్రేమ వార్తల్లో నిలుస్తూ.. చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. సినీ పరిశ్రమలో ప్రేమ కథలు ఎప్పుడు వినిపించినా..  చెప్పినా దిలీప్ కుమార్, మధుబాల కథే అగ్రస్థానం అని చెప్పవచ్చు.

మధుబాల దిలీప్ ల ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది అంటే.. 

వీరిద్దరి ప్రేమ 1951లో ‘తరానా ‘ సినిమా సెట్‌ నుంచి మొదలైంది. ఈ చిత్రంలో దిలీప్ కుమార్, మధుబాల తొలిసారి కలిసి నటించారు.  మధుబాల తొలిసారిగా దిలీప్ ను చూసినప్పుడు అతనితో ప్రేమలో పడ్డారని బాలీవుడ్ ప్రముఖులు చెబుతూ ఉంటారు. మధుబాల అందానికి ప్రపంచం మొత్తం దాసోహం అంటే.. మధుబాల హృదయం మాత్రం దిలీప్ కుమార్‌ని కోరుకుంది. దీంతో తన ప్రేమను దిలీప్ కుమార్ కు తెలియజేయడానికి మధుబాల తన మేకప్ ఆర్టిస్ట్‌లో ఒకరి ద్వారా ఎర్ర గులాబీ పువ్వుతో పాటు.. ఓ లేఖని  పంపింది. ఆ ఉత్తరంలో ‘నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ గులాబీని తీసుకోండి’ అని రాసి ఉంది. దిలీప్ .. గులాబీ పువ్వుని తీసుకుని తాను మధుబాల ప్రేమను అంగీకరించాడు. దీంతో వీరిద్దరి ప్రేమ కథ మొదలైంది.

ఇవి కూడా చదవండి

‘తరానా’ సినిమా తర్వాత.. ఇద్దరూ కలిసి చాలా చిత్రాలలో పనిచేశారు. హిందీ సినిమా చరిత్రలో నిలిచినా  ‘మొఘల్-ఎ-ఆజం’ రిలీజయింది. ఈ సినిమాలో దిలీప్ కుమార్ షెహజాదా సలీం, మధుబాల అనార్కలిగా నటించారు. ఈ సినిమాలో దిలీప్ కోరిక మేరకే అనార్కలి పాత్రలో మధుబాలని తీసుకున్నారని.. ఆయన మధుబాలని రికమెండ్ చేశారని చెబుతూ ఉంటారు.

మొఘల్-ఎ-ఆజంతో విడిపోయారు

‘తరానా’ సినిమా సెట్స్ నుంచి మొదలైన ప్రేమ.. ‘మొఘల్-ఏ-ఆజం’ సెట్స్‌తో అంతమైందని అంటారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఇద్దరూ విడిపోయారని బీ టౌన్ టాక్. దిలీప్.. మధుబాలను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన అక్క ద్వారా మధుబాలకు పెళ్లి ప్రతిపాదనను పంపాడు.. అయితే మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్ ఈ పెళ్లి ప్రస్తావనను తిరస్కరించాడు. అతావుల్లాఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం దిలీప్ మనసును గాయపరిచింది. అయితే తనను మధుబాల ..  ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అందుకనే  ఒక రోజు మరొక సినిమా షూటింగ్ సెట్‌లో దిలీప్ కుమార్ మధుబాలను ఈ రోజే పెళ్లి చేసుకుందాం అని పెళ్లి ప్రపోజల్ ను మధుబాల ముందు పెట్టాడు. అయితే పెళ్ళికి ఒక షరత్తుకూడా పెట్టాడు. పెళ్లి తర్వాత  మధుబాల తన తండ్రితో అన్ని సంబంధాలను తెంపుకోవాలని సూచించాడు.

దిలీప్ కుమార్ షరత్తు విన్న మధుబాల పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దిలీప్ కుమార్ మధుబాల సమాధానం చెప్పమని అడిగాడు.. నీ మౌనాన్ని తాను ఏ విధంగా అర్థం చేసుకోవాలని కోరాడు.. అయినప్పటికీ మధుబాల మౌనంగా ఉంది. దీంతో దిలీప్  నేను ఒక్కసారి ఇక్కడ నుంచి వెళ్తే ఇక తిరిగి రాను అని చెప్పి..  అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి దిలీప్, మధుబాల ఇద్దరి దారులు వేరయ్యాయి.

దిలీప్ కుమార్ కోర్టులో వాంగ్మూలం.. 

1957లో బిఆర్ చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో దిలీప్ కుమార్‌కు జోడీగా వైజయంతిమాల నటించింది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా మధుబాల ఎంపికైంది. BR చోప్రా ఈ చిత్రాన్ని భోపాల్‌లో షూటింగ్ జరపాలని భావించాడు. అయితే మధుబాల తండ్రి తన కుమార్తెను భోపాల్‌కు పంపడానికి నిరాకరించాడు. అంతేకాదు సినిమా షూటింగ్ ను ముంబైలో కూడా చేయవచ్చు అని ఓ సలహా కూడా ఇచ్చాడు. దీంతో తన సినిమా నుంచి మధుబాలను తొలగించి.. వైజయంతిమాలకు అవకాశం ఇచ్చాడు బిఆర్ చోప్రా.  దీంతో మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్.. దర్శకుడిపై కేసు పెట్టాడు.. దీంతో చోప్రా కూడా తాను మధుబాలకు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి అడిగాడు. ఈ విధంగా వ్యవహారం కోర్టుకు చేరింది,. కోర్టులో మళ్ళీ మధుబాల, దిలీప్ కుమార్ మరోసారి ఒకరినొకరు ఎదురుపడ్డారు.

ఈ విషయంలో, దిలీప్ .. చిత్ర దర్శకుడికి మద్దతు పలికాడు. అయితే మొఘల్-ఎ-ఆజం’ షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇద్దరూ చిత్రాన్ని పూర్తి చేసారు. ఈ చిత్రం 1960లో విడుదలైంది. ఇందులో సలీం .. అనార్కలి జంటను ప్రజలు ఇష్టపడ్డారు.

మధుబాలను కడసారి చేసుకోలేకపోయిన దిలీప్ కుమార్

విడిపోయిన ప్రేమికులు .. తమ తమ జీవితాల్లో ముందుకు సాగారు. మధుబాల కిషోర్ కుమార్..  దిలీప్ కుమార్ సైరా బానుని వివాహం చేసుకున్నారు. ఇద్దరి దారులు విడిపోయినా, మధుబాల దిలీప్ గుండెల్లో, దిలీప్ మధుబాల గుండెల్లోనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది అంటే ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేదు. మధుబాల అనారోగ్యంతో బాధపడే సమయంలో దిలీప్ కుమార్‌ను మిస్ అవుతూ ఉండేది..  దిలీప్ కుమార్ కూడా ఆమెను తరచుగా కలిసి పరామర్శించేవాడు.

1969 సంవత్సరంలో గుండె జబ్బు కారణంగా.. మధుబాల కేవలం 36 సంవత్సరాల వయస్సులో ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ శాశ్వతంగా వెడలిపోయింది. అయితే మధుబాలను చివరి సారి దిలీప్ కుమార్ చూడలేకపోయాడు. ఎందుకంటే దిలీప్ కుమార్ ఆ సమయంలో సినిమా షూటింగ్ నిమిత్తం చాలా దూరంలో ఉన్నాడు. మధుబాల మరణవార్త విని దిలీప్  షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే నేరుగా ఆమె సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసి మధుబాలతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ లోకంలో ఇద్దరూ లేరు.. కానీ దిలీప్, మధుబాలల ప్రేమ కథ ఇప్పటికీ సజీవంగా ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…