వారిఇళ్లపై ఐటీ దాడులకు కారణం అదే, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, ఖండించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సి పొన్ను తదితరుల ఇళ్ళు , కార్యాలయాలపై ఐటీ దాడులకు కారణం వారు ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమేనని మహారాష్ట్రలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సి పొన్ను తదితరుల ఇళ్ళు , కార్యాలయాలపై ఐటీ దాడులకు కారణం వారు ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమేనని మహారాష్ట్రలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. అసమ్మతి గళాలను తొక్కిపెట్టే యత్నంలో భాగమే ఇదని ఆయన చెప్పారు. మోదీ సర్కార్ కి వ్యతిరేకంగా వీరు గళమెత్తుతున్న ఫలితమే ఈ దాడులకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి, దాని విధానాలకు ఎవరు వ్యతిరేకంగా నిరసన గళాలను వినిపించినా వారిని టార్గెట్ చేసేందుకు ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం వినియోగించుకుంటున్నదన్నారు. ఇది క్రమంగా స్పష్టమవుతోందన్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ గ్రూప్ సీఈఓ శుభాశీష్ సర్కార్ ఇంటిపైకూడా దాడులు జరిగిన విషయాన్ని నవాబ్ మాలిక్ గుర్తు చేశారు. మొత్తం 30 చోట్ల ఈ దాడులు జరిగినట్టు తమకు సమాచారం అందిందన్నారు.
అటు- ఎక్సీడ్ ఎంటర్ టైన్మెంట్, క్వాన్ వంటి సంస్థలకు చెందిన కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎక్సీడ్ సంస్థకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చాలా ఏళ్లపాటు ఎండీగా వ్యవహరించారు. ఇలా ఉండగా.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఎవరు సమాచారం ఇఛ్చినా ఐటీ దాడులు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఆ తరువాత ఇలాంటివి కోర్టుకు వెళ్తాయన్నారు. అనురాగ్ కశ్యప్, తాప్సి పొన్నుల ఇళ్లపై ఐటీ దాడులకు కారణం వారు రాజకీయ వ్యతిరేక అభిప్రాయాలను వెలిబుచ్చడమే అన్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఇవి అసంబద్ధమైన ఆరోపణలని అయన పేర్కొన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగకూడదా అన్న రీతిలో ఆయన మాట్లాడారు. రైతుల నిరసనలపై తాప్సి పొన్ను, లోగడ సీఏఎ పై అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. వీటిని ప్రభుత్వ వ్యతిరేకమైనవిగా పాలకులు భావించినట్టు కనబడుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి: