ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం.. 2వేలకు పైగా వార్డులు ఏకగ్రీవం.. పురపోరులోనూ సత్తా చాటిన వైఎస్సార్‌సీపీ

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.

ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం.. 2వేలకు పైగా వార్డులు ఏకగ్రీవం.. పురపోరులోనూ సత్తా చాటిన వైఎస్సార్‌సీపీ
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 03, 2021 | 7:56 PM

AP Municipal Elections 2021 : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న ఎన్నికలు జరగనున్న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం 17, 418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 2,900 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.

ఇక, ఏకగ్రీవాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో కైవసం చేసుకుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలు. మొత్తం 248 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలోని 31 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పలమనేరులో 26 వార్డులకు గానూ 18 వార్డులు వైసీపీ సొంతమవడంతో ఛైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకుంది. నగిరి మున్సిపాలీటిల్లో 7 వార్డులు వైసీపీ అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 16 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ లోని 50 డివిజన్లకు గానూ 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక జిల్లాలో 118 వార్డులకు ఎన్నికలు జరగాల్సిన ఉంది.

ప్రకాశం జిల్లాలో 198 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అటు శ్రీకాకుళం జిల్లాలో 74 వార్డులు, విశాఖపట్నం జిల్లాలో 151 వార్డులు, విజయనగరం జిల్లాలో 160 వార్డులు ఏకగ్రీవం అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అటు గుంటూరు జిల్లాలో 233 వార్డులు, కృష్ణా జిల్లాలో 129 వార్డులు, నెల్లూరు జిల్లాలో 98 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో 257 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో 358 వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎస్ఈసీ ప్రకటించింది.

ఇదిలావుంటే, వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం చూపారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు వచ్చాయని అన్నారు. నామినేషన్లు వేసేందుకు టీడీపీ అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ మూసేవేసుకుంటే బెటర్‌ అని అన్నారాయన.అధికారమే లేకుంటే మున్సిపల్ పన్నులు ఎలా తగ్గిస్తాడని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుని పంచాయతీకి, మున్సిపాల్టీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను సవరణకు సంబంధించి పారదర్శకంగా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్నుపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో గెలుస్తందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండిః వేసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు… విజయవాడ టీడీపీదేనన్న ఎంపీ కేశినేని నాని