కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు.. ఈ ఏడాది మూడు విడతల్లో సామూహిక వివాహాలకు టీటీడీ ఏర్పాట్లు
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందిస్తోంది. వెంకన్న, పద్మావతీ ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది.
TTD kalyanamasthu : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందిస్తోంది. వెంకన్న, పద్మావతీ ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో కల్యాణమస్తు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ముహూర్తాలని ఖరారు చేసింది. శ్రీవారి ఆలయ పండితులు భేటీ అయి కల్యాణమస్తు కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాలను నిర్ణయించారు. ఈ మేరకు లగ్నపత్రిక రాశారు. శ్రీవారి ఆలయ పండితులు భేటీ అయి కల్యాణమస్తు కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాలను నిర్ణయించారు.
వేలమంది నిరుపేద జంటలను ఏకం చేస్తూ ఒకే వేదికపైన వివాహం చేసే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే పునఃప్రారంభించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం. అందుకు అవసరమైన నూతన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిగమ్నమైంది. ఇప్పటికే ముహూర్తాలు పెట్టిన టీటీడీ వేదికలను నిర్ణయించి త్వరలోనే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది.
హిందు ధర్మప్రచారంలో భాగంగా మన సంస్కతి సంప్రదాయాలు ఉట్టి పడేవిధంగా గతంలో టీటీడీ నిర్వహించిని సామూహిక వివాహ కార్యక్రమమైన కళ్యాణమస్తును టీటీడీ నిర్వహిస్తోంది. గతంలో 44 వేలకు పైగా జంటలను ఒక్కటి చేసినా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని కొన్ని కారణాల వల్ల నిలిపివేసిన టీటీడీ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తిరిగి ఈ కార్యక్రమాని ప్రారంభించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ ప్రపంచంలోనే అతి పెద్ద హిందు ధార్మిక సంస్థ. హిందు ధర్మ ప్రచారానికి టీటీడీ అధిక ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి ఏటా హిందు ధర్మప్రచారానికి టీటీడీ రెండు వందల కోట్ల రూపాయల పైగానే వెచ్చిస్తుంది. హిందు ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ కళ్యాణమస్తు, శ్రీనివాస కళ్యాణం, గోవింద కళ్యాణాలు, మనగుడి, శుభప్రదం, సదాచారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా మన సంస్కతి, సంప్రదాయాలకు విస్తృత ప్రచారం కల్పించడమే ధ్యేయంగా పని చేస్తుంది టీటీడీ. ఇవి కాకుండా పురాతణ ఆలయాలను పరిరక్షించడం కాలనీలో ఆలయ నిర్మాణాలకు ఆర్థికసాయం చేయడం వంటి కార్యక్రమాలను టీటీడీ పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ ద్వారా హిందు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలు వారికి అందించడమే కాకుండా హిందువులు ఇతర మతాలు వైపు మళ్లకుండా అడ్డుకోవచ్చన్నది టీటీడీ ప్రయత్నిస్తోంది.
2007 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి నేతత్వంలో టీటీడీ అట్టహాసంగా కళ్యాణమస్తు కార్యక్రమాని ప్రారంభించింది. ప్రతిఒక్క పేదవాడికీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో రాజశేఖర్‌రెడ్డి హాయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామూహిక కళ్యాణం కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వధువరులకు ఉచితంగా బట్టలతో పాటు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలు అందిచడమే కాకుండా, హిందు సంప్రదాయాలు అనుగుణంగా వివాహ వేడుకలను నిర్వహిస్తుంది. నూతన వధువరులతో పాటు వారి బంధువులకు 50 మందికీ ఉచితంగా భోజనం కూడా సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది టీటీడీ. అందుకు సంబంధించి ఖర్చులను పూర్తిగా టీటీడీయే భరించనుంది. ఇలా, గతంలో ఒక్కో జంట వివాహానికి 8వేల రూపాయలు వరకు వెచ్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి విడత దాదాపు 5వేల నుంచి 12వేల వరకు జంటలు పాల్గొన్నాయి. దీంతో ఏడు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీటీడీ దాదాపు 50కోట్లను వెచ్చించింది.
2007 ఫిబ్రవరి 22న నిర్వహించిన మొదటి విడత కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 4,658జంటలు, 2007 ఆగష్టు 26న జరిగిన రెండో విడత కార్యక్రమం ద్వారా 8,113జంటలు, 2008 మార్చి 9న జరిగిన మూడో విడత కళ్యాణమస్తు ద్వారా 6,373 జంటలు, 2008 నవంబరు 2న జరిగిన నాలుగో విడత కళ్యణమస్తు కార్యక్రమం ద్వారా 7,090 జంటలు, 2009 అక్టోబర్ 28న జరిగిన ఐదో విడత కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 7,724 జంటలు, 2011 మే 20 న ఆరో విడత కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 11,251 జంటలు ఒక్కటైయ్యాయి.
ఇలా దాదాపు 44వేలకు పైగా జంటలు ఒక్కటైన కల్యాణమస్తూ కార్యక్రమాని టీటీడీ 2011 ద్వితియార్ధంలో నిలిపివేసింది. టీటీడీ అకస్మాత్తుగా ఈ కార్యక్రమాని రెండు ప్రధాన కారణాలు వున్నాయి. ఒక్కటీ వివాదాలు, మరొక్కటి ఇంటి దొంగల అవినీతి.ఈ కార్యక్రమం జరిగే సమయంలో పలు చోట్ల వివాదాలు చెలరేగాయి. కొందరు రెండో పెళ్లి చేసుకుంటూ వుండడం మరి కొందరు ఇతర మతాలకు చెందిన వారు ఈ వివాహా తంతులో ఒక్కటవుతావుండడంతో పలు చోట్ల కార్యక్రమం సమయంలోనే వివాహా వేదిక వద్ద గొడవలు జరగాయి. వాటిని సద్దుమణిగించడానికి పోలీసులు అక్కడికి రావడం వంటి ఘటనలు నేపథ్యంలో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆ సమయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికతో టీటీడీ ఈ పథకానికి మంగళం పాడేసింది. అనంతరం ఇన్ని రోజుల తర్వాత టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చొరవతో కళ్యాణమస్తును ప్రారంభించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కళ్యాణమస్తు కార్యక్రమానికి ఇప్పటికే ముహూర్తాలు కూడా ఖరారు చేశారు వేద పండితులు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై టీటీడీ అధికారుల సమక్షంలో సామూహిక వివాహాలకు సుమూర్తాన్ని నిర్ణయించారు. ఈ సంవత్సరం మే 28 మధ్యాహ్నం 12.34 నుండి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుండి 11:08 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుండి 10.02 వరకు ముహూర్తాలు పెట్టి లగ్న పత్రికను తయారు చేశారు. దీంతో పది సంవత్సరాల అనంతరం టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. గతంలో 2007 నుండి 2011 సంవత్సరం వరకు 6 విడతలుగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కళ్యాణమస్తు వేదికలను నిర్ణయిస్తామని, కళ్యాణమస్తు లో వివాహం చేసుకున్న వారికి మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.