Allu Arjun Arrest: వన్ డే త్రిల్లర్.. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు కారణం ఇదేనా..?
జరిగింది విషాదం.. మళ్లీ జరక్కుండా చూసుకుందాం.. మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నా అని వీడియో సందేశమిచ్చిన పుష్పరాజ్ అరెస్టు అంచులదాకా వెళ్లారు.
ఓ థియేటర్‌లో జరిగిన దుర్ఘటన స్టార్ హీరో అరెస్ట్ దాకా వస్తుందని ఊహించలేదెవరూ..! సూపర్‌డూపర్ హిట్ జోష్‌లో ఉన్న పుష్ప ఇంటి తలుపలు తట్టారు హైదరాబాద్ పోలీసులు. యువ్వార్ అండర్ అరెస్ట్ అంటూ ఏకంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచటంతో రెండు వారాల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అనంతరం నాటకీయ పరిణామాలతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ చకచకా జరిగిపోయాయి. చివరికి హీరో రేంజ్‌లోనే వెంటనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయింల్ మంజూరు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్ప వెలువరించింది. పుష్ప సిన్మాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న వార్తతో దేశమంతా షాక్.
పుష్ప-2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకులు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందంటూ హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. వారంలో వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో రికార్డులన్నీ బ్రేక్ చేస్తోంది పుష్ప2. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన థాంక్యూ ఇండియా మీట్‌లో పాల్గొని హైదరాబాద్‌కి తిరిగి రాగానే అరెస్టయ్యారు పుష్పరాజ్. డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చినప్పుడు అభిమానులు పోటెత్తారు. తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బీఎన్‌ఎస్ 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ని ఏ11గా చేర్చారు.
అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చినప్పుడు భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ.. అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణకు ముందే పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. హీరో వచ్చినా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదనేది పోలీసుల వెర్షన్. అయితే తాను రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనడం అవాస్తవమంటున్నారు అల్లు అర్జున్. సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌కు వెళ్లడం సహజమేనని, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు కాగానే జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు బన్నీ. మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. తొక్కిసలాట ఘటనలో కొందరి అరెస్ట్‌తో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ సక్సెస్ మీట్ నుంచి తిరిగి రాగానే పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా బన్నీ ఇంటి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. తండ్రిని కారు నుంచి దించేసి పోలీసులతో వెళ్లిపోయారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అరెస్ట్‌పై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉందని, అల్లు అర్జున్‌కి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని వాదించారు ఆయన తరుఫు లాయర్లు. వాదోపవాదాల తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
వారం రోజులుగా వరల్డ్ వైడ్ ప్రభంజనం సృష్టిస్తోంది పుష్ప2 సిన్మా. నార్త్‌లో కూడా కలెక్షన్ల దుమ్మురేగుతోంది. ఈ సమయంలో సక్సెస్ మీట్లలో పాల్గొంటున్న హీరో అరెస్ట్ వార్త దేశమంతా చర్చనీయాంశమైంది. హీరో అరెస్ట్ సంచలనం సృష్టించటంతో.. సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై స్పందించారు. చట్టం తన పనితానుచేసుకుపోతుందన్న సీఎం.. ఇందులో తన జోక్యమేమీ ఉండదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని రేవంత్‌రెడ్డి స్పందించారు. అయితే విపక్ష పార్టీల స్పందన మరోలా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్, బీజేపీ ఖండించాయి. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం.. పాలకుల అభద్రతా భావానికి పరాకాష్టన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించారు. వీరికి తోడు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.
థియేటర్‌లో తొక్కిసలాటకు హీరో కారణమెలా అవుతారన్న చర్చ మొదలైంది. భద్రతాపరమైన వైఫల్యాలకు నటీనటులను బాధ్యులనెలా చేస్తారని సంధ్య థియేటర్ ఘటనపై పరోక్షంగా స్పందించారు బాలీవుడ్ నటుడు వరుణ్‌థావన్. అసలా ప్రీమియర్‌కి అనుమతి ఉందా? అల్లు అర్జున్ థియేటర్‌కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందా అన్నదానిపై భిన్నవాదనలు నడుస్తున్నాయి. తాము పోలీసులకు ముందే లేఖ రాశామని థియేటర్ యాజమాన్యం చెబుతుంటే, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నారు జీపీ. అర్జున్ థియేటర్‌కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని ఆయన లాయర్లు వాదిస్తే.. హీరో హీరోయిన్లని పిలవొద్దని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు ముందే చెప్పారని జీపీ వాదించారు. అదీ కాక థియేటర్‌కు ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీ రావడంతోనే తొక్కిసలాట జరినట్లు కోర్టుకు నివేదించారు.
అరెస్ట్ గురించి తెలియగానే చిరంజీవి దంపతులతో పాటు మెగాస్టార్ సోదరుడు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సినీరంగ ప్రముఖులు, అభిమానులు కోర్టు దగ్గరికి తరలివచ్చారు. అల్లు అర్జున్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టడంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నేరం రుజువైతే బీఎన్‌ఎస్ 105 సెక్షన్ కింద ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే.. 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118 (1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు పడే అవకాశం ఉంది. తొలిసారి టాలీవుడ్ అగ్రహీరో అరెస్ట్ కావడం తెలుగురాష్ట్రాలనే కాదు యావత్‌దేశాన్నీ కుదిపేస్తోంది.
సిన్మా ఫంక్షన్ జరిగితే, ప్రముఖ హీరో హీరోయిన్లు వస్తున్నారంటే జనం సహజంగానే పోటెత్తుతారు. చాలావరకు ఫంక్షన్లు సాఫీగానే జరిగినా.. అభిమానుల అత్యుత్సాహంతోనో, జనసమ్మర్ధంతో కొన్నిచోట్ల పరిస్థితి అదుపుతప్పుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ కొన్ని జరిగాయి. అభిమానులు పరిమితికి మించి రావటంతో నోవాటెల్‌లో దేవర సిన్మా ఈవెంట్‌ని గతానుభవాలతో రద్దు చేయాల్సి వచ్చింది. గతేడాది జనవరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలను హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించారు. గేట్ ఓపెన్ చేయగానే అభిమానులు దూసుకురావటంతో తొక్కిసలాట జరిగి కొంతమంది గాయపడ్డారు.
తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో యాజమాన్యంపైనే కేసు పెడతారనుకున్నారు. గానీ.. చివరికది అల్లు అర్జున్ గుమ్మం దాకా వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఓ పక్క పుష్ప-2 సిన్మా రికార్డులు బ్రేక్ చేస్తున్న టైంలో.. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందని అనుకోలేదెవరూ..! అందుకే దేశమంతా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ గురించే చర్చ.
ఇక చివరికి రిమాండ్‌కి నాంపల్లి కోర్టు ఆదేశించిన.. కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అరెస్టే ఓ సంచలనమైతే.. కోర్టుల్లోవాదోపవాదాలు, తీర్పులతో కొన్ని గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠ. నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధిస్తే, అల్లు అర్జున్‌ని జైలులో అడుగుపెట్టగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అల్లు అర్జున్‌పై పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని అభిప్రాయపడ్డ హైకోర్టు.. 4వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటిదాకా టెన్షన్ పడ్డ ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చంచల్‌గూడ జైల్లోకి అడుగుపెట్టి.. కాసేపటికే తిరిగొచ్చేశారు పుష్పరాజ్.
రిమాండ్ కాస్తా రిలీజ్‌గా మారటంతో పుష్పరాజ్ హ్యాపీ. కేసు టెన్షన్ లేకుండా కొన్ని వారాలపాటు సిన్మా సక్సెస్‌ని ఆయన ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈమధ్య టాలీవుడ్‌ని ఏవో ఒక కేసులు వెంటాడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలుకెళ్లాల్సి వచ్చింది. బెయిల్‌పై బయటికొచ్చినా ఈ కేసు ఆయన కెరీర్‌కి మైనస్‌గా మారింది. ప్రముఖ హీరో నాగార్జున ఎన్-కన్వెన్షన్ కూల్చివేత టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఆ తర్వాత తమపై అనుచిత వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖపై న్యాయపోరాటానికి దిగింది నాగార్జున ఫ్యామిలీ. జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ మోహన్‌బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ టాలీవుడ్‌నే కాదు మొత్తం సిన్మా ఇండస్ట్రీనే కుదిపేసింది..!
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..