బాహుబలితో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తైనా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి ఏకంగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్, నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఒకటి, సందీప్ వంగా దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి మాత్రం మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాల అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర సభ్యులు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ టీజర్ అభిమానులను నిరాశ పరిచిన నేపథ్యంలో ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక మరో సర్‌ప్రైజ్ సలార్ మూవీ నుంచి రానుందని టాక్ నడుస్తోంది.
సలార్ సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే నుంచి కూడా ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ 23 వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఆదిపురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథామార్థంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.