Punjab Elections 2022: పంజాబ్ ఎన్నికల బరిలోకి రైతు సంఘాలు.. 117 స్థానాల్లో పోటీ చేస్తామన్న బల్బీర్ సింగ్ రాజేవాల్
Punjab Elections 2022: పంజాబ్‌లోని 32 రైతు సంఘాలలో 22 సంస్థలు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాయి. 22 సంస్థలు పంజాబ్ యునైటెడ్ సమాజ్ మోర్చా పేరుతో పార్టీని ఏర్పాటు చేశాయి.

Punjab Assembly Elections 2022: పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. అధికార పార్టీ కాంగ్రెస్ , బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే, మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. పంజాబ్‌లోని 32 రైతు సంఘాలలో 22 సంస్థలు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాయి. 22 సంస్థలు పంజాబ్ యునైటెడ్ సమాజ్ మోర్చా పేరుతో పార్టీని ఏర్పాటు చేశాయి. రైతుల ఈ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తుందని రైతుల ఫ్రంట్ కన్వీనర్ బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు.
శనివారం మీడియా సమావేశంలో బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ.. విభిన్న భావజాలం కలిగిన వారితో ఐక్య కిసాన్ మోర్చా ఏర్పడిందన్నారు. మేము చాలా పెద్ద యుద్ధంలో గెలిచి వచ్చాము. మనపై ప్రజల్లో నిరీక్షణ పెరిగిందని, ప్రజల ఒత్తిడి మనపై పెరిగిందని, ఫ్రంట్‌ను గెలిపించగలిగితే పంజాబ్‌కు కూడా ఏదైనా చేయగలమని అన్నారు. ప్రజల వాణిని వింటూ పంజాబ్ కోసం ఫ్రంట్‌ను ప్రకటిస్తున్నానని, దానికి పంజాబ్ సంయుక్త సమాజ్ మోర్చా అని పేరు పెట్టనున్నట్టు చెప్పారు. మిగతా మూడు సంస్థలు మాతో వచ్చేందుకు తమలో తాము ఆలోచిస్తున్నాయన్నారు. పంజాబ్‌లోని మొత్తం 117 సీట్లకు పోటీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని బల్బీర్ రాజేవాల్ తెలిపారు. మా ఇతర సంస్థలు ఎవరైనా సరే మాతో రావాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పంజాబ్ ఆవిర్భావానికి ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.
పంజాబ్‌లో రైతులను ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించిన తర్వాత, ఇప్పుడు పోరు మరింత ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్, అమరీందర్ సింగ్ పార్టీలతో పాటు బీజేపీ ఇప్పటికే ఎన్నికల పోరులో ఉంది. తొలి సర్వేలో ఆప్ పంజాబ్‌లో అత్యధిక సీట్లు సాధిస్తుందని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు రైతుల ఈ ప్రకటన తర్వాత, పంజాబ్ ఎన్నికల చిత్రం భిన్నంగా మారింది.