Assembly Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపాలా? వద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం తర్జన భర్జన..
5 State Elections: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతూ రాకెట్ వేగంతో విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్(కోవిడ్-19) ప్రభావం వచ్చే ఏడాది ప్రారంభంలో
5 State Elections: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతూ రాకెట్ వేగంతో విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్(కోవిడ్-19) ప్రభావం వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడనుంది. ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సభలు, సమావేశాలు ఇలాగే కొనసాగితే సెకండ్ వేవ్‌ను మించిన ఉత్పాతం తప్పదని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలా? వద్దా? అన్న విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో ఈ భేటీకి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
చురుగ్గా ఏర్పాట్లు! వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షిస్తూ వస్తోంది. తాజాగా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం స్వయంగా పర్యటించింది. తాజాగా డిసెంబర్ 28-30 తేదీల మధ్య పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటన ఖరారు చేసుకుంది. కొత్త ఓటర్ల నమోదు, లోపాలు లేని ఓటర్ల జాబితా, ఎన్నికల్లో హింస జరగకుండా అవసరమైన కేంద్ర పారామిలటరీ బలగాలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి 2 డోసుల వ్యాక్సినేషన్‌తో పాటు అవసరమైన బూస్టర్ డోస్ వంటి అనేకాంశాలను పరిగణలోకి తీసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
‘ఒమిక్రాన్’ గుబులు.. ఓవైపు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంటే, మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ ‘ఒమిక్రాన్’ దేశంలో గుబులురేపుతోంది. క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా చోట్ల క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలు, సభలు, సమావేశాలు, సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. పరిస్థితులు చూస్తుంటే సెకండ్ వేవ్ ముందు నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఎన్నికల సభలు, ర్యాలీల కారణంగా నాడు ఎన్నికలు జరిగిన తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎన్నికల సభలను అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు మళ్లీ ఆ తరహాలో న్యాయస్థానాలతో చీవాట్లు పెట్టించుకునే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం లేదని తెలుస్తోంది. ఓవైపు ఏర్పాట్లను సమీక్షించుకుంటూనే, మరోవైపు ఎన్నికల నిర్వహణకు తగిన వాతావరణం ఉందా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
అంతుచిక్కని ‘ఒమిక్రాన్’ ఇదిలా ఉంటే, యూకే, యూఎస్ఏ సహా అనేక పశ్చిమ దేశాల్లో శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఆందోళన కల్గిస్తున్న ఒమిక్రాన్ రకం కోవిడ్-19ను మిగతా వేరియంట్లతో పోల్చినప్పుడు అంత ప్రాణాంతకం కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డెల్టాతో పోల్చినప్పుడు వ్యాప్తి 3 రెట్లు ఎక్కవ వేగంతో జరుగుతున్నప్పటికీ, తేలికపాటి లక్షణాలతో డెల్టా కంటే త్వరగా తగ్గిపోతోందని తెలుస్తోంది. అప్పటికే 2 డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారికి సైతం ఒమిక్రాన్ సోకుతున్నప్పటికీ, అంత ప్రాణాంతకం కాకపోవడం ఊరట కల్గించే విషయమని, అయినప్పటికీ ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించవద్దని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సైతం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టే చర్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేస్తున్న కేంద్రం, జాతీయస్థాయిలో ఆంక్షలు విధించే ఆలోచనలో లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం అభిప్రాయం కోరితే ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మహాత్మ కొడియర్, టీవీ9 రిపోర్టర్
Also read:
Sushmita Sen Break Up: మా బంధం ముగిసింది.. రోష్మన్‌తో బ్రేకప్‌పై సుస్మిత క్లారిటీ
Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!