AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో ఎల్‌డీఎఫ్‌కే పట్టం కట్టిన ప్రీపోల్‌ సర్వే, మలబార్‌లో ఎల్‌డీఎఫ్‌ క్లీన్‌స్వీప్‌, కాసర్‌గోడ్‌ జిల్లా మంజేశ్వరంలో బీజేపీ గెలిచే ఛాన్స్‌

కేరళలో మరోసారి లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి ప్రీ పోల్‌ సర్వేలు. మనోరమ న్యూస్‌-వీఎమ్‌ఆర్‌ సంయుక్తంగా నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో...

కేరళలో ఎల్‌డీఎఫ్‌కే పట్టం కట్టిన ప్రీపోల్‌ సర్వే, మలబార్‌లో ఎల్‌డీఎఫ్‌ క్లీన్‌స్వీప్‌, కాసర్‌గోడ్‌ జిల్లా మంజేశ్వరంలో బీజేపీ గెలిచే ఛాన్స్‌
Kerala Assembly Election Pre Poll Survey
Balu
|

Updated on: Mar 22, 2021 | 12:02 PM

Share

కేరళలో మరోసారి లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి ప్రీ పోల్‌ సర్వేలు. మనోరమ న్యూస్‌-వీఎమ్‌ఆర్‌ సంయుక్తంగా నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ బ్రహ్మండమైన విజయాన్ని సాధించబోతున్నట్టు తేలింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ఈ సర్వేను నిర్వహించారు. సుమారు 27 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించారు. వారి మనోభావాలను గుర్తించారు. మెజారిటీ ఓటర్లు ఎల్‌డీఎఫ్‌ పక్షానే నిలిచారు. కాసర్‌గోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కోజికూడ్‌ జిల్లాలలో ఎవరికి ఎన్ని స్థానాలు దక్కుతాయన్నది తెలుసుకుందాం! ఈ జిల్లాలలో ఉన్న 32 అసెంబ్లీ స్థానాలలో ఎల్‌డీఎఫ్‌ 27 స్థానాలలో జయకేతనం ఎరగవేయనుందట! కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కే నాలుగు స్థానాలు మాత్రమే లభిస్తాయని సర్వే చెబుతోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకు ఒక స్థానం దక్కవచ్చట! కాసర్‌గోడ్‌ జిల్లాలోని మంజేశ్వరం అసెంబ్లీ స్థానంలో బీజేపీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది సర్వే సారాంశం. ఇక్కడి నుంచి రాష్ట్ర బీజేపీ అధినేత కె.సురేంద్రన్‌ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇక కాసర్‌గోడ్‌లోని త్రిక్కారిపూర్‌, కన్నూర్‌లోని ఇరిక్కుర్‌, కోజికోడ్‌ జిల్లాలోని కోజికోడ్‌ నార్త్‌, కొడువల్లి స్థానాలలో పోటీ చాలా తీవ్రంగా ఉండబోతున్నది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ముందుగా నాలుగు జిల్లాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం!

కాసర్‌గోడ్‌ జిల్లాకు వస్తే, ఈ జిల్లాలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మంజేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ గెలిచే ఛాన్సుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! మిగిలిన నాలుగు నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌లకు చెరో రెండు స్థానాలు లభించవచ్చు. కన్హాన్‌గడ్‌, ఉడుమ నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌కు విజయావకాశాలు ఉండగా, కాసర్‌గోడ్‌, త్రిక్కారిపూర్‌ నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ గెలిచే ఛాన్స్‌ ఉంది. అయితే త్రిక్కారిపూర్‌లో పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలో యూడీఎఫ్‌కు 38.94 శాతం ఓట్లు లభిస్తాయి. ఎల్‌డీఎఫ్‌కు 35.84 శాతం ఓట్లు లభిస్తుంటే, ఎన్‌డీఏకు 24.84 శాతం ఓట్లు లభించవచ్చన్నది సర్వే అభిప్రాయం. మొత్తం మీద ఇక్కడ బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోబోతున్నది.. కన్నూర్‌ జిల్లాలో ఎల్‌డీఎఫ్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ తొమ్మిది స్థానాలు లభించవచ్చట! రెండే రెండు స్థానాలలో ఎల్‌డీఎఫ్‌ కంటే యూడీఎఫ్‌ కాసింత ముందంజలో ఉంది. ఒక్క కూత్తుపరంబ నియోజకవర్గం మినహా మిగిలిన పది చోట్లా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడో స్థానంతో సంతృప్తి చెందాల్సిన పరిస్థితి. ఈ జిల్లాలో వామపక్ష కూటమికి 51.35 ఓట్ల శాతం లభించే అవకాశం ఉంది. ఇక యూడీఎఫ్‌కు 34.46 శాతం ఓట్లు, ఎన్‌డీఎకు 13 శాతం ఓట్లు లభించబోతున్నాయి. కన్నూరు, ధర్మోదం, పయ్యన్నూర్‌, కలైస్సెరీ, తలిప్పరంబ, మట్టన్నూర్‌, తలైస్సెరీ, కూతుపరంబ, పెరవూర్‌ నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ విజయం సాధిస్తుంది. అజికూడ్‌, ఇరిక్కూర్‌ నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ గెలుస్తుంది. వాయనాడ్‌ జిల్లాకు సంబంధించినంత వరకు ఇక్కడ కూడా లెఫ్ట్‌ కూటమి ఆధిపత్యమే కనిపిస్తోంది. ఈ జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించే అవకాశాలు మిక్కుటంగా ఉన్నాయని ప్రీపోల్‌ సర్వే చెబుతోంది. మనంతవాడి, సుల్తాన్‌ బాతెరీ కల్పెట్టా నియోజకవర్గాలలో లెఫ్ట్‌ కూటమి గెలుపు నల్లేరుమీద నడక కావచ్చు. ఈ మూడు నియోజకవర్గాలలోనూ యూడీఎఫ్‌ రెండో స్థానంలో, ఎన్‌డీఎ మూడో స్థానంలో నిలవబోతున్నాయి. సర్వే ప్రకారం ఎల్‌డీఎఫ్‌కు 54.42 ఓట్ల శాతాన్ని దక్కించుకోబోతున్నది. యూడీఎఫ్‌ 32.02 శాతం ఓట్లను, ఎన్‌డీఎ 12.41 శాతం ఓట్లను సంపాదించుకోబోతున్నాయి.

కోజికోడ్‌ జిల్లాలో కూడా వామపక్ష కూటమి హవా కనిపిస్తున్నది.. అయితే కొన్ని చోట్ల మాత్రం హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది. వదకర నియోజకవర్గంలో యూడీఎఫ్‌ విచిత్రంగా రెవల్యూషనరీ మార్క్సిస్ట్‌ పార్టీ అభ్యర్థి కె.కె.రాముకు మద్దతు ఇస్తోంది. ఈ నియోజకవర్గంలో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అభ్యర్థి మనయత్‌ చంద్రన్‌ గెలుస్తాడని సర్వేలో తేలినప్పటికీ సర్వే ముగిసిన తర్వాత యూడీఎఫ్‌ అనూహ్యంగా రాముకు మద్దతు పలకడంతో ఇప్పుడు సమీకరణలు మారిపోయాయి. లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ ఎల్‌డీఎఫ్‌లో భాగస్వామి అన్న విషయం తెలిసిందే. రివల్యూషనరీ మార్క్సిస్ట్‌ పార్టీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. పైగా ఆయన ప్రచారం భావోద్వేగాల మధ్య సాగుతున్నది. గత ఎన్నికల్లో చేజారిన కుట్టైడీ నియోజకవర్గాన్ని ఎల్‌డీఎఫ్‌ తిరిగి దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు కారణం సీపీఎం తరఫున స్థానికంగా బలమైన అభ్యర్థి కె.పి.కున్హముద్దీన్‌ కుట్టీ బరిలో ఉండటం. ఐయూఎమ్‌ఎల్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే పరక్కాల్‌ అబ్దుల్లా విజయం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి వచ్చింది. 2016 ఎన్నికల్లో అబ్దుల్లా 1157 ఓట్ల మెజారిటీతో సీపీఎంకు చెందిన కె.కె.లతికను ఓడించారు. ఇక నడపురం, పెరంబ్రా, బాలుస్సెరి, ఎలత్తూర్‌, కొయిలాండీ, కున్నమంగళం, కొడువల్లి, తిరువంబాడీ, బేపూర్‌ నియోజకవర్గాలను ఎల్‌డీఎఫ్‌ నిలబెట్టుకునే ఛాన్సుంది. కోజికూడ్‌ నార్త్‌ నియోజకవర్గంలో ఎల్‌డీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. ఎల్‌డీఎఫ్‌కు 36.10 శాతం ఓట్లు లభిస్తాయని, యూడీఎఫ్‌కు 32.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీజేపీకి 30.10 శాతం ఓట్లు లభిస్తుండటం. ఇక సౌత్‌ కోజికోడ్‌ నియోజకవర్గంలో ఈసారి ఎల్‌డీఎఫ్‌ గెలిచే అవకాశం ఉంది. క్రితంసారి యూడీఎఫ్‌లో భాగస్వామిగా ఉన్న ఐయుఎమ్‌ఎల్‌ విజయం సాధించింది. కొడువల్లిలో ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉండబోతున్నది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video