ప్రేమకు కులం అడ్డు.. ఆందోళనతో యువజంట ఆత్మహత్య
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్న ఆ జంటకు కులమే శాపమైంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్న ఆ జంటకు కులమే శాపమైంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చిత్తూరుు జిల్లా సోమల మండలంలోని మేటిమంద అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరువురు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక సోమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ప్రక్క గ్రామమైన పేగలవారి పల్లె కు చెందిన ఆటో డ్రైవర్ ని ప్రేమించింది. కొంతకాలం ఇద్దరూ కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ, ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయం వారిని వెంటాడింది. కలిసి జీవించే అవకాశం తమకు ఉండదని భావించిన ప్రేమికులిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయారు. ఫిబ్రవరి 15న ఇంట్లోంచి వెళ్లిపోయిన వీరిద్దరి కోసం కుటుంబీకులు, బంధవులు చుట్టుపక్కలంతా గాలించారు.10 రోజులు గడిచిపోయిన ఆచూకీ లభించకపోవటంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. చుట్టుపక్కల చెరువులు, కుంటలు వెతికారు. చివరకు ఫిబ్రవరి 28వ తేదీన మేటిమంద అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు అదృశ్యమైన ప్రేమజంటగా గుర్తించారు. ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు చనిపోయి చాలా రోజులు కావటంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమజంట సూసైడ్ తో రెండు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది.