హాఫ్ సెంచరీకి పైగా చోరీలు…కానీ, చివరకు అలా చిక్కాడు ?

అతనో ఘరానాదొంగ. మహా మాయగాడు. స్కెచ్‌ వేశాడంటే...పంట పండాల్సిందే. ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా హాఫ్ సెంచరీకి పైగా చోరీలు చేశాడు. కిలోలకొద్దీ బంగారంతో జల్సాలు చేశాడు.

హాఫ్ సెంచరీకి పైగా చోరీలు...కానీ, చివరకు అలా చిక్కాడు ?
Follow us

|

Updated on: Sep 09, 2020 | 12:55 PM

అతనో ఘరానాదొంగ. మహా మాయగాడు. స్కెచ్‌ వేశాడంటే…పంట పండాల్సిందే. ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా హాఫ్ సెంచరీకి పైగా చోరీలు చేశాడు. కిలోలకొద్దీ బంగారంతో జల్సాలు చేశాడు. వరుస చోరీలపై సీరియస్‌గా దృష్టిపెట్టిన పోలీసులు ఎట్టకేలకు కేటుగాణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల మేరకు.

చిత్తూరుజిల్లా వడ్డిపల్లికి చెందిన బత్తుల ప్రభాకర్‌, అలియాస్‌ రాహుల్‌రెడ్డి…వెస్ట్‌గోదావరిజిల్లా శృంగవృక్షానికి మకాం మార్చాడు. గాజువాకకు చెందిన పెదపాటి నవీన్‌, విజయనగరంజిల్లా దబ్బగెడ్డకు చెందిన తవిటిరాజు …బత్తుల ప్రభాకర్‌కు జతకలిశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లూటీ చేసి…ఆ బంగారాన్ని ఎవ్వరికీ అనుమానం రాకుండా విక్రయించేవారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 16 న పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూ పరదేశిపాలెం చర్చిలో బత్తుల ప్రభాకర్‌ గ్యాంగ్‌ చోరీకి పాల్పడ్డారు. 51 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా ఈ కేసును సీరియస్‌గా తీసుకుని…ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డీసీపీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో క్రైం టీమ్‌ విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీలో దొంగను చూసి..బత్తుల ప్రభాకర్‌గా నిర్ధారించుకున్నారు. పక్కా సమాచారంతో గోపాలపట్నంలో ఉంటున్న బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతనికి రిసీవర్లుగా ఉన్న నవీన్‌, తవిటిరాజులను రిమాండ్‌కు తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారించడంతో 50కి పైగా చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్క విశాఖ పరిధిలోనే ఏకంగా 35 చోరీలు చేశాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 108 తులాల బంగారం, 153 తులాల వెండి, 1.65 లక్షల నగదును రికవరీ చేసినట్టు విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు.

గ్యాంగ్‌లీడర్‌ బత్తుల ప్రభాకర్‌ కేవలం ఇళ్లలోనే కాదు…ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాదు కాలేజీల్లోనూ చేతివాటం ప్రదర్శించాడని తెలిపారు. మొత్తానికి ఘరానాదొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు బృందాన్ని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా అభినందించారు. పోలీసులు ఇంత తక్కువ సమయంలో దొంగను పట్టుకుని…సొమ్ము రికవరీ చేయడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశంసించారు.