యూఏఈ కాన్సులేట్ పేరిట ఖాతా.. స్వప్నకు రూ.58 కోట్లు అందాయి: ఎన్ఐఏ

కేరళ గోల్డ్ స్కాం కేసులో మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ బంగారం అక్రమ రవాణాతో పాటు ఆమె ముఠా చేసిన మోసాలు వెలుగుచూస్తున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 3:25 pm, Tue, 15 September 20
యూఏఈ కాన్సులేట్ పేరిట ఖాతా.. స్వప్నకు రూ.58 కోట్లు అందాయి: ఎన్ఐఏ

కేరళ గోల్డ్ స్కాం కేసులో మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ బంగారం అక్రమ రవాణాతో పాటు ఆమె ముఠా చేసిన మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె ముఠా 2018 కాన్సులేట్ పేరిట తెరిచిన ఖాతా ద్వారా స్వప్న రూ.58 కోట్లు అందుకుందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. యుఎఇ కాన్సులేట్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సొమ్మును పొందినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. యుఎఇ కాన్సులేట్ వద్ద తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి స్వప్న సురేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తంలో లైఫ్ మిషన్ ప్రాజెక్టుకు రూ .20 కోట్ల సహాయం అందిందని అధికారులు తేల్చారు. యుఎఇ ఆధారిత రెడ్ క్రెసెంట్. ఈ రూ .20 కోట్లలో 14.5 కోట్ల రూపాయలను నిర్మాణానికి అప్పగించారు. అంతేకాదు త్రిస్సూర్ వడకాంచెరిలో లైఫ్ మిషన్ పథకంలో పాల్గొన్న సంస్థ నుంచి స్వప్న ఆమె ముఠా రూ .4 కోట్లు కమీషన్ కూడా తీసుకుందని దర్యాప్తు బృందం గుర్తించింది.

యుఎఇ కాన్సులేట్ పేరిట ఒకే బ్యాంకులో ఆరు ఖాతాలు ఉన్నాయని.. ఈ ఖాతాల్లో 58 కోట్ల రూపాయలు వచ్చి చేరినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఖాతాలో ప్రస్తుతం రూ.4 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని అదే బ్యాంకులోని మరొక ఖాతా ద్వారా భారత కరెన్సీ రూపంలోకి మార్చారని ఎన్ఐఏ తెలిపింది. యుఎఇ కాన్సులేట్ పేరిట సమాంతర ఖాతాను తెరిచి బ్యాంక్ ఖాతాలు దౌత్య రక్షణను పొందారని దర్యాప్తు బృందం తెలిపింది. కాన్సులేట్ పేరిట నకిలీ సీల్స్, నకిలీ పత్రాలను పిఎస్ సరిత్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఇలాంటి ఖాతాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.