వాగులో పడి ఆరుగురు విద్యార్థుల దుర్మరణం
పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థులు వాగులో పడి ప్రాణాలను కోల్పోయారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థులు వాగులో పడి ప్రాణాలను కోల్పోయారు. వేలేరుపాడు మండలం వసంతవాడలో ఈ విషాద ఘటన జరిగింది. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని వసంతవాడకు చెందిన కొన్ని కుటుంబాలు వాగు సమీపంలో వనభోజనాలకు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తలు వాగులో మొదట ముగ్గురు విద్యార్థులు పడిపోయారు. వీరిని రక్షించే క్రమంలో మరో ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. చనిపోయిన వారిలో గొట్టిపర్తి మనోజ్(15), గంగాధర వెంకట్రావు(15), కెల్లా పవన్(17), కర్నాటి రంజిత్(16), కూనారపు రాధాకృష్ణ(15), శ్రీరాముల శివాజీ(17)గా గుర్తించారు. ఒకే గ్రామంలో ఆరుగురు మరణించడంతో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల తల్లీదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వాగులో నుంచి విద్యార్థుల మృతదేహాలను స్థానికులు బయటకు వెలికితీశారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.