Cyber Fraud: ఇలా కూడా మోసం చేస్తారా.. బంగారు గనుల పేరుచెప్పి.. రూ.77.74 లక్షలకు టోకరా
గతేడాది ఓ మహిళ నుంచి వచ్చిన ఫోన్ కాల్ పూణెకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు ముక్కూమొహం తెలియని వ్యక్తులను నమ్మి ఇంత ఈజీగా ఎలా మోసపోతారబ్బా? అనే సందేహం కలగకమానదు. కానీ, నిందితులు ట్రాప్ చేసే విధానం చూస్తే ఎవ్వరినైనా బోల్తా కొట్టించగలరేమో అనిపిస్తుంది. ఇతడి కేసులో కూడా ఇదే జరిగింది.

ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఒక కరెన్సీని మరొక కరెన్సీకి మార్పిడి చేయడం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. ఈ స్కాం కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 77.74 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. సైబర్ నేరాల గురించి ఎంతలా అవగాహన కల్పించినప్పటికీ డబ్బు ఆశచూపగానే కొందరు ముందూ వెనకా చూడకుండా ఉన్నదంతా సమర్పించేసుకుంటున్నారు. ఆ తర్వాత మోసం బయటపడి ఇలా నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.
ఇలా ట్రాప్ చేశారు..
బంగారు గనుల తవ్వకాల్లో ఫారెక్స్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు భారీగా లాభాలు వస్తాయని సదరు మహిళ బాధితుడిని ముందుగా కన్విన్స్ చేసింది. ముందుగా రూ.50 వేలు ఇన్వెస్ట్ చేయాలని కోరింది. వారి ఫేక్ కంపెనీల గురించి పరిచయం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఫేక్ లింక్ లు, వెబ్ సైట్స్ చూపించి నమ్మించింది. వాట్సాప్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని రిజిస్ట్రేషన్ పేరుతో ట్రాప్ చేసింది. తర్వాత అతడి పేరుతో ఓ పోర్టల్ లో అకౌంట్ తెరిచినట్టుగా చూపింది.
డబ్బులు డాలర్లుగా మారడంతో..
ఆగస్టు 28న, అతను రూ.50,000 పెట్టుబడి పెట్టాడు. అతని డబ్బులు డాలర్లుగా మారినట్లు గమనించాడు. వెంటనే అతను వాటిని ట్రాక్ చేసి ఇదంతా నిజమేనని నమ్మాడు. అక్కడితో ఆగకుండా పెట్టుబడి పెట్టడం కొనసాగించాడు. ఇలా నాలుగు నెలల్లో 51 లావాదేవీలు చేశాడు. స్కామర్ల సూచనల మేరకు వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.77.74 లక్షలను బదిలీ చేశాడు. అతడి అకౌంట్లో తన పెట్టుబడి సొమ్ము నాలుగింతలై రూ. 2.57 కోట్లుగా మారిందని చూసుకుని ఎగిరిగంతేశాడు. దీంతో ముందుగా రూ. 25,200 కోట్లు విత్ డ్రా చేశాడు.
మోసం ఇలా బయటపడింది..
మరోసారి డబ్బులు డ్రా చేద్దామని ప్రయత్నించడంతో అసలు మోసం బయటపడింది. అక్కడి నుంచి అతడు పెట్టిన విత్ డ్రా రిక్వెస్టులన్నీ ఫెయిలైనట్టు చూపించాయి. దీంతో కంపెనీ వారిని కాంటాక్ట్ చేయగా మనీలాండరింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి నిధులను పొందేందుకు వారు ‘రిస్క్ సెక్యూరిటీ డిపాజిట్’గా రూ.26 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడికి మోసపోయినట్టుగా అర్థమై ఘొల్లుమన్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 318 (మోసం), 319 (వ్యక్తిగతంగా మోసం చేయడం) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66D (కంప్యూటర్ వనరులను ఉపయోగించి వ్యక్తిగతంగా మోసం చేయడం) కింద కేసులు నమోదు చేశారు.




