AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల స్వాహాలో డొంక కదులుతోంది.. డిపాజిట్ల గోల్‌మాల్‌లో వెలుగులోకి కొత్త కోణం..!

Telugu Academy: డొంక కదులుతోంది. నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం కొలిక్కివస్తోంది. తెలుగు అకాడమీని నిండా ముంచేసిన అక్రమార్కుల గుట్టురట్టయ్యింది. ఈ కేసులో కీలక సూత్రధారుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల స్వాహాలో డొంక కదులుతోంది.. డిపాజిట్ల గోల్‌మాల్‌లో వెలుగులోకి కొత్త కోణం..!
Telugu Academy
Balaraju Goud
|

Updated on: Oct 01, 2021 | 3:55 PM

Share

Telugu Academy Funds Scam: డొంక కదులుతోంది. నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం కొలిక్కివస్తోంది. తెలుగు అకాడమీని నిండా ముంచేసిన అక్రమార్కుల గుట్టురట్టయ్యింది. ఈ కేసులో కీలక సూత్రధారుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆకాడమీ పుస్తకాల మాటు ఆక్రమాలకు పాల్పడ్డ కేటుగాళ్ల అసలు భాగోతాన్ని వెలికితీస్తున్నారు.

యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలితో సహా ఏపీ మార్కంటైల్ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేశారు CCS పోలీసులు. తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వెనుక యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ మేనేజర్ మస్తాన్ వలీనే సూత్రధారిగా తేలింది. కార్వాన్ అండ్ సంతోష్‌నగర్ బ్రాంచ్‌ల నుంచి నిధులు దారి మళ్లిన సమయంలో మస్తాన్ వలీనే మేనేజర్‌గా ఉన్నాడు. కార్వాన్‌ బ్రాంచ్‌లో రూ.43 కోట్లను దారి మళ్లించిన మేనేజర్ మస్తాన్‌ వలీ రెండు నెలల క్రితమే సంతోష్‌నగర్ బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లాడు. అక్కడ కూడా రూ.8 కోట్లను కాజేశాడు. ఇదే తరహాలో మరో మూడు బ్యాంకుల నుంచి రూ.26 కోట్లు కొట్టేశాడు. చందానగర్ కెనరా బ్యాంక్ నుంచి మరో రూ.9 కోట్లు.. రెండు కోఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి రూ.17 కోట్లు దాకా దోచేశాడు.

తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాజేసిన నిధుల మొత్తం పెరుగుతోంది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్, అగ్రసేన్ బ్యాంక్ ఖాతాల నుంచి నిధులు దారి మళ్లినట్లు తేల్చారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో మొత్తం కుంభకోణం విలువ రూ.77కోట్లకు చేరింది. మరోవైపు ఇందుకు సంబంధించి సీసీఎస్ అధికారుల బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.మొత్తం 11 ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 34 బ్రాంచిల్లో ఎఫ్‌డీల రూపంలో తెలుగు అకాడమీ నిధులు ఉన్నాయి. అయితే, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లోని డిపాజిట్లు మాయమైనట్లు తెలుగు అకాడమీ అధికారులు గుర్తించారు. అయితే, ఏ బ్రాంచ్‌లోనూ అకాడమీకి కరెంట్ అకౌంట్‌ లేదు. కరెంట్ అకౌంట్‌ తెరవకుండా నేరుగా ఎఫ్‌డీలు వేయడంతో వాటి వివరాలు బ్యాంకు లావాదేవీల రికార్డుల్లో కనిపించవు. దీన్నే ఆసరా చేసుకుని తెలివిగా ఉపయోగించుకున్న బ్రాంచ్‌ మేనేజర్ మస్తాన్ వలీ… తెలుగు అకాడమీ ఎఫ్‌డీలను వేరే బ్యాంకుకు వక్రమార్గంలో దారి మళ్లించి కాజేశాడు.

సీసీఎస్ పోలీసుల ఇంటరాగేషన్‌లో మస్తాన్ వలీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏడాదికోసారి ఎఫ్‌డీలను అకాడమీ రెన్యువల్ చేస్తుంది. ఈ ఏడాది కాలంలో ఆ డబ్బును లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి, ఎఫ్‌డీల గడువు సమీపించేలోపు తిరిగి యథావిధిగా బ్యాంకులో జమ చేయాలనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, దారి మళ్లించిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదిలావెంటే, తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. హిమాయత్‌నగర్‌లోని అకాడమీ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ రికార్డులను పరిశీలించింది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్ రమేశ్‌తో పాటు ఇతర ఉద్యోగులను ప్రశ్నించారు. బ్యాంకుల నుంచీ సమాచారం తీసుకున్నారు.

తెలుగు అకాడమీ స్కామ్‌లో ఇంటి దొంగల పాత్ర కూడా ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా బ్యాంకుల అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్లు గుర్తించారు. ఇప్పటికే, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్, అగ్రసేన్ బ్యాంక్ అధికారులను ప్రశ్నించిన పోలీసులు… తెలుగు అకాడమీ ఉద్యోగుల పాత్రపై మరింత కూపీ లాగుతున్నారు.

Read Also…  Oldest Man: వరల్డ్ రికార్డు..127 ఏళ్ల వయసులో మరణించిన వ్యక్తి.. ఇంకా ధృవికరించిన గిన్నీస్ బుక్