Nellore District: కోర్టులో చోరీ చేసింది పాత సామాన్లు దొంగలించేవారే.. కేసును చేధించిన పోలీసులు
నెల్లూరు కోర్టులో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు... ఇందులో రాజకీయ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. కేవలం లాభాపేక్షతో చేసిన దొంగతనమేనని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నెల్లూరు కోర్టు ఫైల్స్ చోరీ కేసులో… సస్పెన్స్‌కు తెరపడింది. ఇది పాతనేరస్తుల పనేనని తేల్చారు పోలీసులు. దర్యాప్తులో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిస్సయిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని, డాక్యుమెంట్స్‌ను వారి నుంచి రికవరీ చేశారు. ఈనెల 13న నెల్లూరు కోర్టు నుంచి ఫైల్స్ మిస్సయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. 2016లో నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలు కోర్టు నుంచి చోరీకి అయినట్టు నిర్ధారించిన పోలీసులు.. ఇన్వెస్టిగేషన్‌లో 12వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులపై ఇప్పటికే 14 కేసులు ఉన్నట్టు చెప్పారు. కోర్టుకు కరెక్టుగా 80 నుంచి 90 మీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజ్‌లోనే ఈ చోరీ కేసుకు సంబంధించి మెయిన్ క్లూ దొరికింది. అక్కడ ఓ బ్యాగ్‌ను గుర్తించారు ఖాకీలు. అయితే, అందులోని ఎలక్ర్టానిక్ వస్తువుల్ని మాత్రం దుండగులు ఎత్తుకెళ్లారు. వాటిని అమ్మేసి సొమ్ము చేసుకోవాలని భావించారు. బ్యాగులోని స్టాంపు పేపర్లు, ఇతర డాక్యుమెంట్స్‌ను లైట్ తీసుకున్నారు. అయితే, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు.. ల్యాప్‌టాప్, ట్యాబ్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దీని వెనక రాజకీయ ప్రమేయం ఉందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పెద్దదుమారం రేపాయి. ఈ కేసు మొత్తం.. కొత్తగా మంత్రయిన కాకాణి గోవర్దన్ చుట్టూ తిరిగింది. తనమీదున్న కేసులు రుజువైతే శిక్షపడుతుందనే భయంతో ఆధారాలు లేకుండా చేసేందుకు… ఆయనే ఈ చోరీ చేయించి ఉంటారంటూ… ప్రత్యర్థులు సైతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే,ఈ కేసులో అసలు నిందితుల్ని అరెస్ట్ చేయడంతో పాటు రాజకీయ ప్రమేయమేదీ లేదని పోలీసులు తేల్చడంతో… సస్పెన్స్‌కు తెరపడినట్టైంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. సిట్ విచారణలోనూ.. నిందితులు లాభాపేక్షతోనే ఈ చోరీ చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం.
Also Read: తల్లీ కూతుళ్లతో వ్యక్తి ఎఫైర్.. ఆపై ఊహించని ఇన్సిడెంట్.. విచారణలో విస్తుపోయే నిజాలు