16 మందిని చంపిన ఈ ‘సీరియల్ కిల్లర్’ స్టోరీ తెలిస్తే..!

కల్లు, మద్యం తాగే మహిళలే అతడి టార్గెట్. వారికి మాయ మాటలు చెప్పి, మద్యం తాగించి, నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి చంపేస్తాడు. వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్తాడు. ఆ దోచిన నగలను అమ్మిపెట్టడం సదరు నిందితుడి భార్య పని. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 16మంది మహిళలను హత్య చేశాడు ఆ సీరియల్ కిల్లర్. అయితే పాపం ఎప్పటికైనా పండాల్సిందే. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులకు […]

  • Updated On - 3:10 pm, Sat, 28 December 19 Edited By: Pardhasaradhi Peri
16 మందిని చంపిన ఈ 'సీరియల్ కిల్లర్' స్టోరీ తెలిస్తే..!

కల్లు, మద్యం తాగే మహిళలే అతడి టార్గెట్. వారికి మాయ మాటలు చెప్పి, మద్యం తాగించి, నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి చంపేస్తాడు. వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్తాడు. ఆ దోచిన నగలను అమ్మిపెట్టడం సదరు నిందితుడి భార్య పని. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 16మంది మహిళలను హత్య చేశాడు ఆ సీరియల్ కిల్లర్. అయితే పాపం ఎప్పటికైనా పండాల్సిందే. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులకు చిక్కాడు. అంతే తమ పద్ధతిలో విచారించిన పోలీసులకు నిజాలన్నీ చెప్పేశాడు ఆ కిరాతకుడు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను చేసిన దురాగతాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల దేవరకద్ర మండలం డోకూరు సమీపంలో అలివేలమ్మ(52) అనే మహిళ హత్యకు గురైంది. ఈ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో అతడిని విచారించగా.. ఆమెను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. ఈ నెల 16న మహబూబ్‌నగర్‌లోని ఓ కల్లు దుకాణానికి వెళ్లిన శ్రీను, అలివేలమ్మతో మాటలు కలిపాడు. మాటల మధ్యలో దేవరకద్ర ప్రాంతంలో ఒకరు తనకు రూ.20వేలు ఇవ్వాల్సి ఉందని, ఇప్పిస్తే రూ.4వేలు ఇస్తానని ఆమెకు ఆశ చూపాడు. ఆ మాటలను నమ్మిన అలివేలమ్మ బైక్‌లో శ్రీను వెంట వెళ్లింది. మార్గమధ్యంలో ఈ ఇద్దరూ మద్యం తాగారు. డోకూర్ సమీపంలోకి రాగానే అలివేలమ్మ ఛాతీపై బలంగా కొట్టి, తలను నేలకేసి బాది చంపాడు శ్రీను. ఆ తరువాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, కాలి పట్టీలు ఎత్తుకెళ్లాడు.

అయితే 2007లో సొంత తమ్ముడిని హత్య చేసిన శ్రీను జైలుకు వెళ్లాడు. పరివర్తన కింద అప్పీలు చేసుకొని.. మూడేళ్లలో బయటకు వచ్చాడు. తరువాత కూడా పలుమార్లు జైలుకు వెళ్లాడు. కానీ బయటకు వచ్చిన తరువాత హత్యలు చేస్తూనే ఉన్నాడు. ఇక గతేడాది జైలు నుంచి వచ్చిన తరువాత 4 హత్యలు చేసినట్లు అంగీకరించాడు. షాద్‌నగర్, శంషాబాద్ పరిధితో పాటు మిగిలిన ప్రాంతాల్లో మహిళలను హత్య చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో టీఎస్‌ఎండీసీ ఇసుక యార్డులో ఓ మహిళ ఎముకల గూడు బయటపడగా.. ఆ హత్య కూడా ఇతగాడి పనేనని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇతడిపై ఇప్పటివరకు 18కేసులు నమోదు ఉన్నాయి. వాటిలో ఒకటి కస్టడీ నుంచి తప్పించుకున్నది కావడం విశేషం. ఇదిలా ఉంటే తరచూ నేరాలకు పాల్పడి జైలుకు వస్తున్న ఇతడిలో మార్పును తెచ్చేందుకు జైళ్ల శాఖ తమ ఆధ్వర్యంలో నడుపుతోన్న ఓ పెట్రోల్‌ బంకులో ఉపాధి కల్పించింది. కానీ అక్కడ విధులకు సరిగా హాజరుకాకపోవడంతో వారు తొలగించారు. అయితే మళ్లీ ఉన్నాతాధికారులకు ఫోన్లు చేసి అక్కడే పని చేసేవాడు శ్రీను. తాజాగా అతడి హత్యలకు సంబంధించిన విషయం తెలిసి జైలు అధికారులు అవాక్కయ్యారు. ఇక ఈ హత్యలో భాగం పంచుకున్న అతడి భార్య సాలమ్మనూ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఒకటిన్నర తులాల బంగారం, 60తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.