YSR Pensions: విజయనగరంలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు.. చనిపోయినవారి పేర్లతో సొమ్ములు నొక్కేసిన సిబ్బంది
విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన వారి పేర్లతో సొమ్ములు కాజేసిన సిబ్బంది బాగోతం బట్టబయలైంది.
YSR Pensions: విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన వారి పేర్లతో సొమ్ములు కాజేసిన సిబ్బంది బాగోతం బట్టబయలైంది. గరివిడి మండలం బొండపల్లిలో వైఎస్సార్ పింఛన్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడినట్లు ఎట్టకేలకు నిర్ధారణ అయింది. దీంతో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రేగాన శ్రీరామ్, వాలంటీర్లు దాసరి రాంబాబు, గొట్టాపు శంకర్రావు, ఎల్.శ్రీనివాసరావు, ఎస్.హేమలతపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
కుమ్మక్కైన అధికారులంతా కలిసి రూ.1.47 లక్షలు స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఉదంతంపై డివిజినల్ అభివృద్ధి అధికారి రామచంద్రరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐదుగురిని విధుల నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే, దివ్యాంగుడైన నల్లబోలు రామారావు 2020 ఆగస్టులో మృతి చెందగా అతని పేరుతో తొమ్మిది నెలల పింఛను రూ.45 వేలు, బుద్దరాజు రమణమ్మ 2020 సెప్టెంబరులో చనిపోగా ఆమె పేరిట 9 నెలల మొత్తం రూ.20,250 స్వాహా చేశారు.
అటు, కొన్న లక్ష్ము 2021 ఏప్రిల్‌లో మరణించగా ఆ తర్వాత మూడు నెలల పాటు రూ.6,750, తామాడ తవుడమ్మ, బొత్స తాత 2020 జులైలో చనిపోగా వారికి మంజూరైన పది నెలల మొత్తం రూ.44,500 చొప్పున డ్రా చేశారు. కలిశెట్టి సూరమ్మ, పొట్నూరు భాగయ్య 2021 మార్చిలో మరణించిన తర్వాత వారి పేరిట మూడు నెలల మొత్తం రూ.13,500 స్వాహా చేశారు. పెరుమాలి తాతయ్య 2021 జనవరిలో మరణించగా ఐదు నెలల పింఛను రూ.11.250, గొట్టాపు సోములు, 2021 ఏప్రిల్‌లో చనిపోగా రెండు నెలల మొత్తం రూ.6 వేలు కాజేశారు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలపై టీవీ9లో కథనాలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించగా అసలు విషయం బట్టబయలైంది.
Read also: Podu land fight: పోడు చిచ్చుతో పచ్చటి పల్లెల్లో చిందుతోన్న నెత్తురు