Andhra Pradesh: పగటి సమయాల్లో ఆటోలో రెక్కీ.. రాత్రి వేళల్లో ఆలయాల్లో చోరీ.. అవే టార్గెట్
పగటి సమయంలో ఆటోలో ప్రయాణిస్తారు. గ్రామాలు, కాలనీల్లోని దేవాలయాల చుట్టూ తిరుగుతారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రికి టార్గెట్ ఫిక్స్ చేస్తారు. అందరూ నిద్ర పోయే సమయానికి ఆలయాల్లో దూరి కేవలం హుండీలనే ఎత్తుకెళ్తారు. గుంటూరు(Guntur)...
పగటి సమయంలో ఆటోలో ప్రయాణిస్తారు. గ్రామాలు, కాలనీల్లోని దేవాలయాల చుట్టూ తిరుగుతారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రికి టార్గెట్ ఫిక్స్ చేస్తారు. అందరూ నిద్ర పోయే సమయానికి ఆలయాల్లో దూరి కేవలం హుండీలనే ఎత్తుకెళ్తారు. గుంటూరు(Guntur) నగరానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులను సౌత్ డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా నగరం చుట్టుపక్కలా గుళ్లలో హుండీల అపహరణ ఎక్కువైంది. దీనిపై ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ దృష్టి సారించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముఠాను పట్టుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో నల్లపాడు(Nallapadu) పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించారు. ఆటోలో వస్తున్న ముఠానే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పక్కాగా ప్లాన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం.
అల్లరిచిల్లరగా తిరుగుతూ చెడు వ్యసనాలను బానిసలైన ముగ్గురూ హుండీలను టార్గెట్ చేస్తూ అపహరించుకుపోతున్నట్లు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి చెప్పారు. కుదిరితే ఆలయంలోనే హుండీ ఓపెన్ చేస్తారు. కుదరకపోతే హుండీనే ఎత్తుకెళ్తారు. ఆటోలో కొద్ది దూరం తీసుకెళ్ళిన తర్వాత దాన్ని పగులగొట్టి డబ్బులు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. వారి వద్ద నుండి పద్దెనిమిది వేల రూపాయల నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
టీ. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు