ఓర్నాయనో.. మూన్ లైటింగ్ చేయకుండానే చేశామన్నారు.. వెరిఫై చేయగా..
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డబ్బుల వసూలు చేయడమే టార్గెట్‌గా ఫోన్ కాల్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నకేటుగాళ్లు తాజాగా పీఎఫ్ ఖాతాల్లోకి సైతం దూరేశారు.. ఒక ఉద్యోగికి ఫోన్ చేసి సైబర్ మార్గాల్లో డబ్బులు దండుకోవాలని చూడగా.. వారి జిత్తుల పారలేదు. దీంతో అతడి క్రెడిన్షియల్ ఉపయోగించి మరో పీఎఫ్ ఖాతాకు లింక్ చేసి.. మంచి జాబ్ ఆఫర్ పోయేలాగా చేశారు. పిఎఫ్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యి మనకు తెలియకుండానే ఒకేసారి రెండు కంపెనీలకు పని చేస్తున్నట్లు ఫేక్ కంపెనీని లింక్ చేశారు.

ఆల్రెడీ ఒక జాబ్‌లో ఉన్న సదరు బాధితుడు ఇంటర్వ్యూ కోసం మరో కంపెనీకి వెళ్లాడు. సదరు వ్యక్తి ప్రొఫైల్ చెక్ చేసిన అక్కడి హెచ్‌ఆర్ ఒకేసారి రెండు కంపెనీలలో పనిచేస్తున్నట్లు(మూన్ లైటింగ్) పిఎఫ్ ఖాతాలో చూపించటంతో అతనికి జాబ్ నిరాకరించారు. తాను గతంలో కేవలం ఒక కంపెనీలో మాత్రమే పని చేస్తున్నానని అతను ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఒకేసారి రెండు కంపెనీలలో పని చేస్తున్నట్లు సర్వీస్ హిస్టరీలో చూపించటంతో ఇంటర్వ్యూకి వెళ్లిన సంస్థ బాధితుడిని ఉద్యోగానికి తీసుకోలేదు.
ఇటీవల కొన్ని సందర్భాల్లో సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా స్పందించని బాధితుల ఫోన్ నెంబర్లను గుర్తుపెట్టుకుని మరీ ఈపిఎఫ్ అకౌంట్లలోకి దూరి ఈ తరహాలో బాధితులని టార్గెట్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు రాకుండా చేస్తున్నారు. రాజస్థాన్, యూపీ, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నమోదు చేసిన బోగస్ కంపెనీలకు వారి పీఎఫ్ అకౌంట్స్ లింక్ చేస్తున్నారు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక బాధితులు జుట్టు పీక్కుంటున్నారు. పోలీసుల నుండి ఈపీఎఫ్ అధికారులకు చాలా ఫిర్యాదులు అందడంతో.. ఈపీఎఫ్ అధికారులు ఉద్యోగులకు.. సంబంధం లేని అకౌంట్లను డీ లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
కొద్దిరోజుల క్రితం అప్డేట్ అయిన గైడ్లైన్స్ ప్రకారం వినియోగదారులు నేరుగా ఈపీఎఫ్ లాగిన్‌లోకి వెళ్లి సర్వీస్ హిస్టరీ నుండి అలాంటి బోగస్ కంపెనీలను డీలింక్ చేసే విధంగా వెసులుబాటు కల్పించారు.. దీంతో ఎవరైనా సరే తమకు తెలియకుండా సర్వీస్ హిస్టరీలో మరొక ఫేక్ కంపెనీని లింక్ చేస్తే సర్వీస్ హిస్టరీ నుండి దాన్ని డీ లింక్ చేసుకునే సదుపాయం ఇప్పుడు ఉంది. కానీ ఉద్యోగులు నిజంగానే ఒకేసారి రెండు సంస్థల్లో పనిచేసినప్పుడు మాత్రం ఈ వెసులుబాటు పనిచేయదు. ఇలా ఒకేసారి రెండు సంస్థల్లో పని చేసినప్పుడు డీలింక్ చేయాలి అని చూసినా సర్వీస్ హిస్టరీ నుండి అది తొలగిపోదు. టెక్నికల్ ఎర్రర్ చూపిస్తుంది.
డీలింక్ ఎలా చేయాలి?
- పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ముందుగా EPF మెంబర్ పోర్టల్‌లోకి UAN నంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.
- హోం పేజీలో వ్యూ ఆప్షన్లలో ఉండే సర్వీస్ హిస్టరీలోకి వెళ్లాలి.
- ఈ సర్వీసు హిస్టరీలో మీ PF ఖాతా , కంపెనీల పేర్లు ఉంటాయి. మీ PF అకౌంట్ నుంచి తెలియకుండా ఏదైనా కంపెనీతో లింకై ఉంటే దాని పక్కనే డీలింక్ ఆప్షన్ చూపిస్తుంది.
- బోగస్ కంపెనీకి చెందిన డీలింక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఈ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే డీలింక్ ప్రక్రియ పూర్తవుతుంది.
- ఆ తర్వాత సర్వీసు హిస్టరీ తనిఖీ చేస్తే డీలింక్ అయిన కంపెనీల వివరాలు చూపించదు