
Eight-year-old Child Dies: తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విషాద చోటుచేసుకుంది. అప్పటివరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారికి.. ఊయల తాడే ఆమె పాలిట ఉరితాడైంది. ఊయల తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ దక్కింసేతం ప్రాంతానికి చెందిన భక్త బిస్వాస్, పాణేశ్వరి దంపతులు బతుకుదెరువు కోసం ఆసిఫాబాద్‌కు వచ్చారు. అంకుసాపూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా ఆస్పత్రి భవనం వద్ద భక్త బిస్వాస్ రాడ్‌వైండర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు పక్కనే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ నిన్న సాయంత్రం ఆడుకుంటున్నారు. ఊయల ఊగాలనుకుని ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి పక్కి బిశ్వాస్ హడావిడిగా కుర్చీ వేసుకుని ఊయల ఎక్కబోయింది. ఈ క్రమంలో కుర్చీ పట్టుతప్పి కిందపడటంతో ఊయల తాడు.. చిన్నారి మెడకు బిగుసుకుంది. పక్కి బిశ్వాస్ (8) ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంటూ స్పృహ కోల్పోయింది.
ఇది చూసిన మరో చిన్నారి హర్ష బిస్వాస్.. గట్టిగా కేకలు వేసింది.. దీంతో తల్లిదండ్రులు పరుగున వచ్చి చూసే సరికి పక్కి అపస్మారక స్థితిలో పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు సంతోషంతో ఆడుకున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..