Justice Pushpa Ganediwala: వివాదాస్పద తీర్పుల జడ్జి రాజీనామా.. ఒక రోజు మిగిలి ఉండగానే..
చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో.. వివాదాస్పద తీర్పులు ఇచ్చి సంచలనంగా మారిన బాంబే హైకోర్టు(Bombay High court) మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడివాలా...
చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో.. వివాదాస్పద తీర్పులు ఇచ్చి సంచలనంగా మారిన బాంబే హైకోర్టు(Bombay High court) మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడివాలా(Pushpa Ganediwala) తన పదవికి రాజీనామా చేశారు. అయితే అదనపు జడ్జిగా ఆమె పదవీ కాలం ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జస్టిస్ గనేడివాలా.. బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2021, జనవరి, ఫిబ్రవరిలో లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది.
అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీ కాలాన్ని పొడగించడం, పూర్తి స్థాయి హోదా కల్పించడం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా న్యాయమూర్తి పుష్ప గనేడివాలాను 2022 ఫిబ్రవరి 12 తర్వాత అదనపు జడ్జి నుంచి జిల్లా సెషన్స్ జడ్జిగా డిమోట్ చేయాల్సి ఉంది. కాగా దీనికి ముందుగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాకు ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
12 ఏళ్ల బాలిక ఛాతి భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
ఆ తర్వాత అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్ విప్పుకోవడం లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పు వెలువరించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. అయితే ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.
ఇవీ చదవండి.
IPL 2022: రంగంలోకి దిగుతున్న ధోని.. ఏ ఏ ఆటగాళ్లని కొనుగోలు చేస్తున్నాడంటే..?