శ్రీవారి స‌న్నిధిలో వ‌న్య‌మృగాలు…ఈ చిత్రం ఎప్పుడైనా చూశారా ?!

వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ క‌నిపించే శ్రీవారి ఆలయం నిర్మానుష్యంగా ద‌ర్శ‌న‌మిస్తోంది. భ‌క్తుల‌కు బ‌దులు ఇప్పుడు తిరుమల వీధుల్లో వన్యమృగాలు సంచ‌రిస్తున్నాయి.

శ్రీవారి స‌న్నిధిలో వ‌న్య‌మృగాలు...ఈ చిత్రం ఎప్పుడైనా చూశారా ?!
Follow us

|

Updated on: Apr 09, 2020 | 1:04 PM

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌:
ఎక్క‌డో చైనాలో పుట్టిన మ‌హ‌మ్మారి క‌రోనా ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోంది. భార‌త్‌లోనూ ప్ర‌తాపం చూపిస్తోంది. చిన్నాపెద్ద‌, పేద, ధ‌నిక అనే బేదం లేకుండా అంద‌రినీ ప‌ట్టి పీడిస్తోంది. ఆఖ‌రుకు దేవుళ్ల‌ను కూడా క‌రోనా వెంటాడుతోంది. కోవిడ్ ధాటికి ఏకంగా క‌లియుగ వైకుంఠం తిరుమ‌ల తిరుప‌తి క్షేత్రంలోని శ్రీనివాసుడు కూడా త‌లుపులు మూసుకున్నాడు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో శ్రీవారి ద‌ర్శ‌నం లేని తిరుమ‌ల బోసిపోయింది. 24 గంటలపాటు గోవిందుడి నామస్మరణతో మారుమోగిపోవాల్సిన తిరుమల గిరులు నిశ్శబ్దంగా మారిపోయాయి. వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ క‌నిపించే శ్రీవారి ఆలయం నిర్మానుష్యంగా మారింది. దీంతో తిరుమల వీధుల్లో వన్యమృగాలు సంచ‌రిస్తున్నాయి.
తిరుమ‌ల వీధుల్లో వ‌న్య‌మృగాలు:
తిరుమ‌ల వీధుల్లో వ‌న్య‌మృగాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా తిరుమల దాదాపు నిర్మానుష్యంగా మారడంతో వన్యమృగాలు తిరుమల వీధుల్లోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్ల‌లో చిరుత‌ల సంచారం పెరిగింది.దీంతో స్థానికులు, టిటిడి  సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గుర‌వుతున్నారు. శ్రీవారి సేవాసదన్, కల్యాణ వేదిక మ్యూజియం పరిసరాల్లో ఎలుగు బంట్లు, చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అలాగే బాలాజీ నగర్ ప్రాంతంలో చిరుతలు, అడవి పందుల సంచారాన్ని గుర్తించారు. ఇక ఘాట్ రోడ్డులో అయితే చిరుతల సంచారం విపరీతంగా పెరిగింది. పాపవినాశనం ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.   జింకలు, కణితి, దుప్పుల సంచారం అయితే చెప్పనక్కర్లేదు.
128 ఏళ్ల క్రితం :
128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, శ్రీవారి ఆలయం మాత్రమే తిరుమలలో ఉండడంతో ఉదయం తిరుపతి నుంచి గుర్రాలపై అర్చకులు తిరుమలకు చేరుకునేవారు. సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. 1900 సంవ‌త్స‌రం తర్వాత నుంచి తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతూ రావడంతో వన్యమృగాలు జనసంచారంలోకి రాడం  క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్‌రోడ్లపై రాకపోకల నిషేధంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుమల వీధుల్లోకి ఘాట్‌ రోడ్లపైకి వచ్చేశాయి.