తెలంగాణలో మరోసారి పెరగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 176 మందికి పాజిటివ్, ఒకరు మృతి
కరోనా తీవ్రత తగ్గిందని ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. దీంతో అక్కడక్కడ కొవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి.
Telangana corona cases : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో ఒక్కసారి కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8గంటల వరకు 40,985 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,807కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
కాగా, కరోనా రాకాసి కోరల్లో చిక్కుకుని నిన్న ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,634కి చేరింది. మరోవైపు కరోనా బారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది. శనివారం 163 మంది కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,222కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,951 ఉండగా.. వీరిలో 859 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 87,00,651కి చేరింది.
ఇదిలావుంటే, కరోనా వైరస్ జనంలో భయం పోయినట్లుంది. తాజాగా నమోదవుతున్న కేసులను బట్టి చూస్తేంటే అదే అనిపిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో 12 మంది విద్యార్థులకు, మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకు, మేడారంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులకు శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రజలు కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరుతోంది.
అయితే ఇటీవలే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలు తెరుచుకున్నాయి. అయినప్పటికీ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నెల రోజులుగా సమ్మక్క సారలమ్మ చిన్న జాతర విధుల్లో ఉన్న ముగ్గురు ఆలయ ఉద్యోగులకు ఆరోగ్య శిబిరంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇటీవలే ప్రభుత్వానికి, ప్రజలకు సూచనలు చేసింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. జనం ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. ఇదీ చదవండిః రేపే కరోనా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా.. వివరాలు తెలుసా?