కరోనాని తరిమికొట్టగల ‘మహా ధన్వంతరి’ హోమం !
ప్రాణాంతక రోగం వ్యాప్తి చెందకుండా ఉండాలంటే..ప్రజలంతా సహకరించి సామాజిక దూరం తప్పక పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ఆలయాల్లో విశేషపూజలు నిర్వహిస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కోవిడ్-19 భూతం కబంద హస్తాల్లో ఇరుక్కుపోయింది. కరోనా మహమ్మారి ఏపీ ప్రజల ఆయువు తీస్తోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగానికి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. గత రెండుమూడు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ రాష్ట్రాన్ని హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాల నుంచి రెండంకెల లెక్కల్లో వైరస్ కేసులు నమోదు కావడంతో అంతటా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. దుకాణాలు, మార్కెట్లు అన్ని మూసివేయించారు. ప్రజలు ఇళ్లనుండి కాలు బయటపెట్టకుండా 144 సెక్షన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రాణాంతక రోగం వ్యాప్తి చెందకుండా ఉండాలంటే..ప్రజలంతా సహకరించి సామాజిక దూరం తప్పక పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలోనే పలు ఆలయాల్లో విశేషపూజలు నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం, సామర్లకోట లోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో దాని నివారణ కోసం, లోక శాంతి కోసం ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో అర్చక బృందం ధన్వంతరి హోమం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. భక్తులెవర్నీ లోనికి అనుమతించకుండా అర్చకులు,పండితులు ఈ హోమాలు జరిపారు. స్వామివారికి అర్చకులు రోజువారీ కైంకర్యాలు, పూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈఓ వెల్లడించారు.