తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..?!
తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగింపు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగింపు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మే 25 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలా..? లేదా పాక్షికంగా విధించాలా? అనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, మరోవైపు మే 7నే లాక్‌డౌన్ ఎత్తివేస్తారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో లాక్‌డౌన్ పొడించాల్సిందేనని కుండబద్దలు కొట్టిన కేసీఆర్.. ఈ సారి లాక్‌డౌన్ సడలింపుకే మొగ్గుచూపుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ..వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. అంతేకాదు రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1000 దాటగా.. రికవరీ అయిన పేషెంట్ల సంఖ్య 307 దాటింది. అంటే రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో 31 శాతం మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. మరి కొద్దిరోజుల్లోనే ఇంకొంత మంది కూడా కరోనా బారి నుంచి కోలుకొని రికవరీ అయ్యే అవకాశం ఉంది.
గత ఐదు రోజుల డేటా చూస్తే.. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది. పొరుగున ఉన్న ఏపీ కంటే రికవరీ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. తెలంగాణలో మెజార్టీ కేసులు జీహెచ్ఎంసీ, వికారాబాద్, సూర్యాపేట, గద్వాల ప్రాంతాల్లోనే నమోదు అవుతున్నాయి. రెడ్‌జోన్లలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ.. గ్రీన్‌జోన్లలో లాక్‌డౌన్‌ను సడలించే అవకాశం ఉందనే భావన వ్యక్తం అవుతోంది. మరో వారంపాటు లాక్‌డౌన్‌ను పొడిస్తే కరోనా అదుపులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తే గనుక మరో 14 రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం లేకపోలేదు.




