కరోనా ఎఫెక్ట్: చైనా టూ గాంధీ

దాదాపు 60 దేశాల్లోకి విస్తరించిన ఈ వైరస్ తెలంగాణలోనూ నమోదైంది. వైరస్‌ సోకిన బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.కొవిడ్-19 వైరస్ మొదట శ్వాసకోశాలను దెబ్బతీస్తుంది.

కరోనా ఎఫెక్ట్: చైనా టూ గాంధీ
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 03, 2020 | 1:02 PM

కరోనా గ్రౌండ్ రిపోర్ట్:  కొవిడ్-19: వుహాన్‌లో ఉద్భవించిన మహమ్మారి.. ప్రపంచాన్నేవణికిస్తోంది. చైనా వ్యాప్తంగా విస్తారించి వేల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరించివేసింది. ఇప్పటి వరకు ఈ భూతం 64దేశాలకు పాకింది. వేలమంది ప్రాణాలను తీస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 90వేల931 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3వేల125మంది చనిపోయారు. కరోనా పుట్టిల్లు చైనాలో అత్యధికంగా 80వేల183 కేసులు నమోదు కాగా…అక్కడే 3వేలకు పైగా చనిపోయారు. ఇక చైనా తర్వాత ఎక్కువగా కరోనా ప్రభావమున్న దేశం…సౌత్ కొరియా..ఇప్పటి వరకు కొరియాలో 5వేల 289 కేసులు నమోదు కాగా…40మంది చనిపోయారు.

అత్యంత వేగంగా:  అయితే చైనాలో రోజువారి కేసుల నమోదు…మరణాల సంఖ్య సగటు గత వారం కంటే ఇప్పుడు తగ్గింది. గత వారం వరకు రోజుకు 203 కేసులు నమోదయ్యే పరిస్థితుల నుంచి 113కు తగ్గింది..అలాగే రోజుకు సగటున 100మందికిపైగా చనిపోయే సంఖ్య నుంచి 32కు పడిపోయింది. ఇది ఒక్కటే కాస్త ఊరట కలిగిస్తున్నా…ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం మరింత కలవరపెడుతోంది.

స్తంభించిన వ్యాపారం:  చైనా-సౌత్‌కొరియా తర్వాత ఇరాన్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 1501 కరోనా కేసులు నమోదు కాగా…అత్యధికంగా 66మంది చనిపోయారు. కరోనా ప్రబావంతో అక్కడ వ్యాపార కలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఎయిర్‌పోర్టుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బృందం అక్కడ పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తోంది.

ఇటలీ కకలావికలం:  ఇక ఇటలీని కరోనా కకలావికలం చేస్తోంది. కరోనా ప్రభావంతో ఇటలీ ఇప్పటికే వ్యాపర పరంగా షట్‌డౌన్ అవుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 2వేల 36 కేసులు నమోదు కాగా..52మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇంకా అనుమానిత కేసులు పెరుగుతూనే ఉండటం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెడుతోంది. ప్రస్తుతం అక్కడ రవాణా పూర్తిగా స్తంభించింది. అన్ని దేశాలు ఇటలీకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి.

తెలంగాణలో కలకలం: దాదాపు 60 దేశాల్లోకి విస్తరించిన ఈ వైరస్ తెలంగాణలోనూ నమోదైంది. బెంగళూరు నుంచి బస్సులో వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బస్సులో వచ్చిన ఇతర ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ సోకిన బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటువైపు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

పెరుగుతున్న అనుమానితులు: ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్‌-19 అనుమానిత కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఒక్కరోజే గాంధీలో 30అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరందర్నీ ఐసోలేటెడ్ గదుల్లో ఉంచి…శాంపిల్స్ సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా వీటి రిపోర్ట్ వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. కరోనాపై ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ మంత్రుల బృందం అత్యవసర సమావేశం నిర్వహించి కొవిడ్-19 వైరస్‌పై చర్చించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన అంశాలపై ఆయా శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతిలో హై అలర్ట్: తిరుపతిలో కంగారు పుట్టించిన కరోనా అనుమానిత కేసుపై క్లారిటీ వచ్చింది. బ్లడ్ రిపోర్ట్స్‌లో కరోనా నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 4 రోజుల కిందట కోవిడ్-19 లక్షణాలతో తైవాన్‌కు చెందిన వ్యక్తి ఆస్పత్రిలో జాయిన్‌ కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు..బ్లడ్ శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌ గాంధీకి పంపారు. బ్లడ్ శాంపిల్స్ పరీక్షించిన గాంధీ వైద్యులు కొవిడ్ -19వైరస్ లేదని నిర్ధారించారు. మంగళవారం ఉదయమే తిరుపతి రుయా ఆస్పత్రికి రిపోర్ట్స్ చేరాయి. రిపోర్ట్స్‌ చెక్‌ చేసి కొవిడ్ లక్షణాలు లేవని రుయా ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి.

వైరస్ లక్షణాలు: కొవిడ్-19 వైరస్ మొదట శ్వాసకోశాలను దెబ్బతీస్తుంది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటమని అర్థం. ఈ వైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూస్తే కిరీటం ఆకారంలో కనిపిస్తుంది కనక ఆ పేరు పెట్టారు. చికిత్స కంటే నివారణ మేలు, ఉత్తమం. కనుక ప్రస్తుతానికి చికిత్స లేని ఈ వ్యాధి సోకకుండా తప్పక పాటించాల్సిన పలు జాగ్రత్తలు ఇవే…

జాగ్రత్తలే పరిష్కారాలు : * బహిరంగ ప్రదేశాల్లో తుమ్మకూడదు, దగ్గ కూడదు * జలుబు చేసినా, ముక్కు కారినా, జ్వరం వచ్చినా..తక్షణం వైద్యులను సంప్రదించాలి * ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి * బయటకు వెళ్లినప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి * వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి