Anantapur: పెద్దాయన్ని డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాడు.. లైవ్‌లోకి ఎంటరయిన సీఐ.. ఆ తర్వాత
ఒకనాడు.. దారి కాచి దోపిడీ చేసేవాళ్లు. దండయాత్రలు చేసి కొల్లగొట్టేవాళ్లు. ఇళ్లల్లో పడి దోచుకెళ్లే వాళ్లు. తరువాత.. ట్రెండ్‌కు తగ్గట్టుగా డెబిట్‌కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు.. లేటెస్ట్‌గా యూపీఐలతో మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే.. మరీ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. పీకమీద కత్తిపెట్టరు. ఆయుధాలతో బెదిరించరు. మీ ఇంటికి రారు.. నగానట్రా దోచుకెళ్లరు. జస్ట్.. ముచ్చెమటలు పట్టించి కోట్లు కొట్టేస్తారు. ఎదుటి వాళ్లను ఉన్నచోటే ఉంచి.. వాళ్ల అకౌంట్లలోని డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. దానికంటే ముందు డిజిటల్ అరెస్ట్ చేస్తారు. ఈమధ్య ఈ క్రైమ్ బాగా పాపులర్ అయింది..
మొన్న ఆ మధ్య ఓ సైబర్ నేరగాడు డిజిటల్ అరెస్టు పేరుతో ఏకంగా పోలీస్‌కే వీడియో కాల్ చేసి అడ్డంగా బుక్ అయిన వీడియో మనందరం చూసాం… సరిగ్గా అలాంటిదే మరో సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సైబర్ నేరగాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి వీడియో కాల్ చేసి 30 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయగా… అనుమానం వచ్చిన ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. సీన్ కట్ చేస్తే… నెక్స్ట్ టైం వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడికి… వీడియో కాల్‌లో పోలీస్ కనిపించాడు. ఇంకేముంది సైబర్ నేరగాడికి నోట మాట రాలేదు.
అనంతపురంకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నారాయణరెడ్డిని సైబర్ నేరగాడు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేశాడు. రిటైర్డ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నారాయణరెడ్డి ఆధార్ కార్డు బెంగళూరులో మిస్ యూజ్ అయిందని.. ఆ నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని సైబర్ నేరగాడు రెండు రోజులుగా బెదిరిస్తుండడంతో…. సైబర్ నేరాలపై కాస్త అవగాహన ఉన్న వృద్ధుడు నారాయణరెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సైబర్ నేరగాడి బెదిరింపులను పోలీసులకు చెప్పాడు. సరిగ్గా పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలోనే సైబర్ నేరగాడు రిటైర్డ్ ఉద్యోగి నారాయణరెడ్డికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా… ఫోన్ తీసుకొని టూ టౌన్ సీఐ శ్రీకాంత్ సైబర్ నేరగాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఖంగుతున్న సైబర్ నేరగాడు వెంటనే ఫోన్ కట్ చేసి… మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సైబర్ నేరగాడి వలలో పడకుండా ధైర్యంగా ఎదుర్కొన్న రిటైర్డ్ ఉద్యోగి నారాయణరెడ్డిని పోలీసులు అభినందించి సన్మానం చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని… సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా… వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనంతపురం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.
వీడియో దిగువన చూడండి….
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి