Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Variant: కరోనా నియంత్రణలో ముందున్న దేశాల్లో కొత్త గుబులు.. డెల్టా వేరియంట్‌తో అస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఆఫ్రికా దేశాల అలర్ట్!

ప్రపంచ దేశాలను కుదిపేసిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ముందున్నాయి.

Delta Variant: కరోనా నియంత్రణలో ముందున్న దేశాల్లో కొత్త గుబులు.. డెల్టా వేరియంట్‌తో అస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఆఫ్రికా దేశాల అలర్ట్!
Delta Variant
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 6:58 AM

New Curbs of Delta Variant Surge: ప్రపంచ దేశాలను కుదిపేసిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ముందున్నాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు ప్రజలందరికి వ్యాక్సిన్‌ పంపిణీ అందించడంలోనూ ముందు వరుసలో నిలిచాయి. అయితే, తగ్గుముఖంపట్టిందనుకున్న తరుణంలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్‌ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారంపాటు లాక్‌డౌన్‌ విధించారు. అటు ఆఫ్రికాలోనూ డెల్టా వేరియంట్‌ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సీడీసీ వెల్లడించింది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ దాటికి భారత్‌ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియాలో ఆంక్షలు..

కరోనా నుంచి ఇప్పడిప్పుడే తేరుకున సాధారణస్థితికి వస్తున్నామని భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌ కలవరం సృష్టిస్తోంది. వ్యాక్సినేషన్‌తో ఇబ్బంది లేదనుకున్న సమయంలో ఆస్ట్రేలియాలో తాజాగా కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో సిడ్నీలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవారం రోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూసౌత్‌వేల్స్‌ ప్రీమియర్‌ గ్లాడీస్‌ బెరెజిక్లెయిన్‌ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ నిబంధనలు కఠినతరం..

ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్‌ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్‌ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. ఇండోర్‌ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్‌ విజృంభణకు డెల్టా వేరియంట్‌ కారణం కావచ్చని ఇజ్రాయెల్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్ పేర్కొన్నారు.

ఫిజిలోనూ కొత్త రూల్స్..

కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్లలో మహమ్మారిని కట్టడి చేయడంలో ఫిజీ దేశం విజయం సాధించింది. గడిచిన ఏడాది కాలంగా అక్కడ పాజిటివ్‌ కేసుల జాడ కనిపించలేదు. కానీ, తాజాగా అక్కడి కొవిడ్‌ ఉద్ధృతి మళ్లీ మొదలయ్యింది. గురవారం ఒక్కరోజే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్‌ నెలలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌తో మళ్లీ విజృంభణ మొదలైనట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఫిజీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మరోసారి కొవిడ్ కట్టడి ఆంక్షలకు ఉపక్రమించారు.

ఆఫ్రికాలో థర్డ్‌వేవ్‌..

డెల్టా వేరియంట్‌ ఉద్ధృతితో ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 14 దేశాల్లో ఈ వేరియంట్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గడిచిన మూడు వారాలుగా వైరస్‌ విజృంభణ మరింత ఎక్కువైనట్లు ఆయా దేశాలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్రికా ఖండాన్ని మూడో వేవ్‌ తాకిందని ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్‌ జాన్‌ కెంగాసాంగ్‌ వెల్లడించారు. ఈ దఫా విజృంభణతో మరింత దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌ ప్రభావం కాంగో, ఉగాండాలో మరింత ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.

Read Also…. Covid 19: పరిశోధకులు చెబుతున్న “బయో వార్” ఒక హైపోథిసిస్..! ఎలా సంక్రమిస్తుంది..? ఎలా అంతమవుతుంది…?