13 రోజుల్లోనే 40 వేల కేసులు..తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి..?
ఈ నెలలో 13 రోజుల్లో రోజుకు సగటున 3135 కేసులు నమోదైనట్లు తేలింది. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా మహమ్మారి దేశంలో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్ వరకు నమోదైన కేసులతో పోలిస్తే మే 1 నుంచి మే 13 వరకు 121 శాతం మేర కేసులు పెరిగాయి. ఈ నెల 1న 35వేలున్న కేసుల సంఖ్య 12 నాటికి రెట్టింపు అయ్యింది. ఈ నెలలో 13 రోజుల్లో రోజుకు సగటున 3135 కేసులు నమోదైనట్లు తేలింది. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర వణికిపోతుండగా, గుజరాత్, తమిళనాడు ఆ తరువాతి స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఊరట నిస్తూనే ఆ వెంటనే పంజా విసురుతోంది.
తెలంగాణాలో గురువారం కొత్తగా 41 కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే 31కేసులు నమోదయ్యాయి.. మిగిలిన10 కేసులూ వలస కూలీలవి.. మొత్తం మీద ఇప్పటి వరకు తెలంగాణాలో 1367 పాజిటివ్ కేసులు నమోదు ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 34కి చేరింది. బుధవారం 117 మంది కోలుకుని ఇంటికి వెళ్లారని, ఇప్పటివరకు 939 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 394 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1142 మంది డిశ్చార్జి అయ్యారు. 47 మంది కరోనా వైరస్ కారణంగా మరణించగా, 948 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే.. దేశంలోనే కరోనా వైద్య నిర్ధారణ పరీక్షలు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం విశేషం.