గాల్లోనూ కరోనా వైరస్ కణాలు.. శాస్త్రజ్ఞుల ఆందోళన
ఇన్నాళ్లూ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా వైరస్ కి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. గాలిలో సైతం ఈ వైరస్ అతి చిన్న కణాల రూపంలో..
ఇన్నాళ్లూ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని భావిస్తున్న కరోనా వైరస్ కి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. గాలిలో సైతం ఈ వైరస్ అతి చిన్న కణాల రూపంలో ఉంటుందని, అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తన గైడ్ లైన్స్ లేదా సిఫారసులను మార్చాలని పలువురు శాస్త్రజ్ఞులు కోరుతున్నారు. ఈ మేరకు వారీ సంస్థకు ఓ లేఖను రాశారు. మనిషి తుమ్మినప్పుడో , దగ్గినప్పుడో వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని అనుకుంటూ వచ్చాం .. కానీ ఇప్పుడు గాలి కూడా దీనికి అతీతమైనదేమీ కాదని తెలుస్తోంది అని వీరు పేర్కొన్నారు. 32 దేశాలకు చెందిన సుమారు 239 మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల గురించిన సమాచారాన్ని వచ్ఛేవారం ఓ మెడికల్ జర్నల్ లో ప్రచురించనున్నారు. అయితే వీరి లేఖపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా స్పందించలేదు. కాగా..గాల్లో ఈ వైరస్ కణాలు ఉంటాయన్న విషయాన్ని గత రెండు నెలలుగా తాము పరిశీలిస్తున్నామని, కానీ స్పష్టమైన ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థలో టెక్నీకల్ విభాగానికి చెందిన డాక్టర్ బెనిడిట్టో పేర్కొన్నారు.
పరిశోధకుల బృందం తమ తాజా రీసెర్చ్ గురించి ఎప్పుడెప్పుడు సదరు జర్నల్ లో ప్రచురిస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు తామర తంపరగా పెరుగుతూ అనేక దేశాలను వణికిస్తున్నాయి.