Corona Hospitals: కరోనా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు.. కారణాలను విశ్లేషిస్తే షాకే..!

ముంబై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా వార్డులో ప్రమాదం జరగడంతో అందరి దృష్టి అటుమళ్ళింది. కరోనా వార్డుల్లోను, కరోనా ఆసుపత్రుల్లోనే అగ్ని ప్రమాదాలు జరగడం వెనుక ఏదైన కారణం వుందా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Corona Hospitals: కరోనా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు.. కారణాలను విశ్లేషిస్తే షాకే..!
Corona Hospitals
Follow us

|

Updated on: Mar 26, 2021 | 3:12 PM

Corona Hospitals under fire threat: యావత్ ప్రపంచాన్ని గత ఏడాది కాలంగా వణికిస్తోంది కరోనా మహమ్మారి (coronavirus). చాలా దేశాల్లో కరోనా వైరస్ కేసులను నియంత్రించేందుకు ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించారు. మరికొన్ని దేశాల్లో ఉన్న ఆసుపత్రులను కోవిడ్ (COVID-19) కేసుల కోసం ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చారు. ఇది కూడా వీలు కాని చోట్ల జనరల్ హాస్పిటళ్ళలోని కొన్ని వార్డులను కరోనా ప్రత్యేక వార్డులుగా మార్చారు. వైరస్ సోకిన వారికి జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్సనందిస్తున్నారు. అయితే.. కరోనా ఆసుపత్రుల్లో పలు మార్లు అగ్ని ప్రమాదాలు జరగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ముంబై (Mumbai) నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోను కరోనా వార్డులోనే ప్రమాదం జరగడంతో అందరి దృష్టి అటుమళ్ళింది. దాంతో కరోనా వార్డుల్లోను, కరోనా ఆసుపత్రుల్లోనే అగ్ని ప్రమాదాలు జరగడం వెనుక ఏదైన కారణం వుందా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడాది కాలంగా దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మధ్యలో కొన్ని నెలలపాటు కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపించినా గత నెల రోజులుగా మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ రాష్ట్రంలో ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ముంబై, నాగ్‌పూర్ (Nagpur), పుణె (Pune) నగరాల్లో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మార్చి 26 ఉదయం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కరోనా వార్డులో చికిత్స పొందుతున్న పది మంది కరోనా బాధితులు సజీవ దహనమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు ఏకంగా 23 అగ్నిమాపక యంత్రాలను వినియోగించినా ప్రాణనష్టాన్ని నివారించలేకపోయారు. ముంబైలోని భాండప్ డ్రీమ్స్ మాల్‌లో వున్న సన్‌రైజ్ ఆసుపత్రి (Sunrise Hospital) లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినపుడు ఆసుపత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఏడాది కాలాన్ని పరిశీలిస్తే కరోనా వార్డుల్లోను, ఆసుపత్రుల్లోను అగ్నిప్రమాదాలు చాలానే జరిగాయి. ఇందులో విజయవాడ (Vijayawada)లో ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రి (Covid Special Hospital)ని నిర్వహిస్తున్న స్వర్ణ పాలెస్ (Swarna Palace)‌లో 2020 ఆగస్టు 9వ తేదీన జరిగిన ప్రమాదం పెద్ద దుమారాన్నే లేపింది. నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్ (Hotel Swarna Palace)‌ ప్రమాదంలో ఏకంగా పది మంది కరోనా బాధితులు మృతి చెందారు. మరోవైపు అక్టోబర్ 21వ తేదీన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎల్బీనగర్ షైన్ చిల్డ్రన్స్ ఆసుపత్రి ఐసీయూ వార్డులో అగ్నిప్రమాదం సంభవించి ఓ చిన్నారి మరణించింది. 2020 నవంబర్ 15 రొమేనియాలో కోవిడ్‌ ఆసుపత్రి ఐసీయూలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 2020 నవంబర్ 27న గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని రాజ్‌కోట్ (Rajkot) శివానంద ఆసుపత్రి ఐసీయూ విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మంటల్లో దహనమయ్యారు. 2020 ఆగస్టు 6వ తేదీన గుజరాత్‌‌లోని అహ్మదాబాద్ ఆసుప్రతి ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కరోనా బాధితులు దుర్మరణం చెందారు. 2021 జనవరి 9న మహారాష్ట్రలోని భందారా జిల్లా ప్రభుత్వాసుప్రతి ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌ అయ్యి అగ్నిప్రమాదానికి దారి తీసింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. 2021 మార్చి 20వ తేదీన ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో ఎంఐసీయూ గదిలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే లక్కీగా ఆ వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

అయితే, కరోనా వార్డుల్లో జరిగిన, జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. కరోనా బాధితులను ముట్టుకునేందుకు సిద్దంగా లేని వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లనే కరోనా వార్డుల్లోను, కరోనా ఆసుపత్రుల్లోను అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. దానికి తోడు నిరంతరం పని చేసే విద్యుత్ పరికరాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు దారితీస్తోందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రులు, వార్డుల నిర్వహణపై మరింత ఫోకస్ అవసరమని తేలింది.

ALSO READ: కెనాల్‌లో ఒక్క నౌకే కదా చిక్కుకుందనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కథే వుంది..!

ALSO READ: హీటెక్కుతున్న సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. నియోజకవర్గం గణాంకాలివే..!