AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjunsagar By-Election: హీటెక్కుతున్న సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. నియోజకవర్గం గణాంకాలివే..!

మరో రెండు, మూడు రోజుల్లో సాగర్ ఎన్నికల ప్రచారం ఊపందుకోబోతున్న తరుణంలో నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని వివరాలను సేకరించింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్.

Nagarjunsagar By-Election: హీటెక్కుతున్న సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. నియోజకవర్గం గణాంకాలివే..!
Sagar
Rajesh Sharma
|

Updated on: Mar 25, 2021 | 7:30 PM

Share

Nagarjunsagar By-Election heating up slowly: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పర్వం మెల్లిగా వేడెక్కుతోంది. అందరి కంటే ముందు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా వున్నాయి. అభ్యర్థిని ప్రకటించక ముందే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ హాలియాలో బహిరంగ సభ నిర్వహించి దూకుడు ప్రదర్శించింది. కానీ అభ్యర్థి ఎంపికలో మాత్రం గులాబీ దళపతి ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. మరోవైపు పెద్దగా క్యాడర్, లీడర్లు లేని బీజేపీ.. సాగర్ అభ్యర్థి ఎంపికపై మేధోమధనం జరుపుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో సాగర్ ఎన్నికల ప్రచారం ఊపందుకోబోతున్న తరుణంలో నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని వివరాలను సేకరించింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్.

నల్గొండ జిల్లాలో ఏపీ సరిహద్దులో వున్నదీ నాగార్జునసాగర్ నియోజకవర్గం. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 745 ఓటర్లున్నారు. వీరిలో లక్షా 8 వేల 907 మంది పురుషులు కాగా.. లక్షా ఒక వేయి 838 మంది మహిళా ఓటర్లున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి. గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి, మడుగులపల్లి, నిడమనూరు, అనుముల, త్రిపురారం మండలాల పరిధిలో నాగార్జునసాగర్ నియోజకవర్గం విస్తరించి వుంది. గుర్రంపొడు మండలంలో మొత్తం 34 వేల 622 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 17 వేల 267 మంది కాగా.. మహిళలు 17 వేల 355 మంది. పెద్దవూర మండలంలో మొత్తం ఓట్లు 44 వేల 658. వీరిలో పురుషులు 21 వేల 968 మంది కాగా.. మహిళలు 22 వేల 690 మంది. తిరుమలగిరి మండలంలో మొత్తం 31 వేల 431 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 15 వేల 768 మంది కాగా.. మహిళలు 15 వేల 663 మంది.

అనుముల మండలంలో మొత్తం ఓట్లు 33 వేల 753. వీరిలో పురుషులు 16 వేల 676 మంది కాగా.. మహిళలు 17 వేల 77 మంది వున్నారు. నిడమనూరు మండలంలో మొత్తం ఓట్లు 34 వేల 214 వున్నాయి. వీటిలో పురుష ఓటర్ల సంఖ్య 16 వేల 856 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 17 వేల 358. మడుగులపల్లి మండలంలోని పది గ్రామాలు సాగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలన్నింటిలో కలిపి 7 వేల 225 ఓట్లున్నాయి. వీటిలో 3 వేల 588 మంది పురుషులు, 3637 మంది మహిళలు. త్రిపురారం మండలంలో మొత్తం 33 వేల 842 మంది ఓటర్లుండగా వీరిలో 16 వేల 784 మంది పురుషులు, 17 వేల 58 మంది మహిళలు వున్నారు.

ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. అత్యధికంగా వెనుకబడిన తరగతుల వారి ఓట్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య లక్షా 5 వేల 495 మంది వున్నారు. వీరిలో యాదవ ఓటర్ల సంఖ్య 34 వేల 267. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు.. దాంతో ఈసారి అదే సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చే యోచనలో టీఆర్ఎస్ పార్టీ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ ఓటర్లలో రెండో స్థానంలో ముదిరాజుల ఓట్లు 12 వేల 721, మూడో స్థానంలో గౌడ కులస్థుల ఓట్లు 9 వేల 948 వున్నాయి. ఇక ముస్లిం మైనార్టీల ఓట్లు 8 వేల 115, రజక సామాజిక వర్గం ఓట్లు 7 వేల 896, మున్నూరు కాపుల ఓట్లు 6 వేల 515, కమ్మరి, వడ్ల కులస్థులు 5 వేల 328, కుమ్మరులు 5 వేల 258, వడ్డెరలు 5 వేల 557, పద్మశాలీలు 2 వేల 172, పెరిక కులస్థులు 2 వేల 889, నాయీ బ్రాహ్మణులు కులస్థులు 2 వేల 291, బలిజలు 1,164, కంసాలిలు 828, మేర కులస్థులు 546 మంది వున్నారు. కాగా.. నియోజకవర్గంలో మొత్తం ఎస్సీ ఓటర్ల సంఖ్య 37 వేల 671 మంది కాగా.. వీరిలో మాదిగలు 26 వేల 204, మాలలు 9 వేల 698, బైండ్ల కులస్థులు 617, దాసరులు 669, బుడగ జంగాలు 483 మంది వున్నారు. ఇక ఎస్టీల సంఖ్య 40 వేల 398 కాగా.. అందులో లంబాడీలు 38 వేల 332 మంది, ఎరుకలులు 2వేల 66 మంది వున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓసీ ఓటర్ల సంఖ్య 31 వేల 385 కాగా.. ఇందులో రెడ్లు అధికంగా వున్నారు. వీరి సంఖ్య 23 వేల 472 మంది రెడ్డి కులస్థులున్నారు. వైశ్యులు 3 వేల 517 మంది, కమ్మ కులస్థులు 2 వేల 736 మంది, వెలమలు పన్నెండు వందల 72 మంది, బ్రాహ్మణులు 334 మంది, కరణాలు154 మంది వున్నారు.

పార్టీల వారీగా ఇంఛార్జీలు వీరే..

నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్న రాజకీయ పార్టీలు నియోజకవర్గానికి, మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించాయి. టీఆర్ఎస్ పార్టీ మండలాల వారీగా నియమించిన ఇంఛార్జీలను పరిశీలిస్తే.. తిరుమలగిరి సాగర్‌‌కు రమావత్‌ రవీంద్రకుమార్‌ (దేవరకొండ ఎమ్మెల్యే), అనుములకు కోరకంటి చందర్‌ (రామగుండం ఎమ్మెల్యే), పెద్దవూరకు బాల్క సుమన్‌ (చెన్నూర్‌ ఎమ్మెల్యే), గుర్రంపోడ్‌‌కు కంచర్ల భూపాల్‌రెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే), నిడమనూరుకు నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ ఎమ్మెల్యే), త్రిపురారానికి బాణోత్‌ శంకర్‌నాయక్‌ (మహబూబాబాద్‌ ఎమ్మెల్యే), హాలియా పురపాలికకు కోనేరు కోనప్ప (సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే), సాగర్‌ పురపాలికకు సునీల్‌రావు (కరీంనగర్‌ మేయర్‌)లను ఇంఛార్జీలుగా నియమించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. ఇక బీజేపీ తరపున నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి కే.జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులను ఇంఛార్జీలుగా నియమించింది. వీరిలో రేవంత్ రెడ్డికి ఇటీవల కరోనా సోకడంతో ఆయన ఇంటికే పరిమితమవుతున్నారు. ప్రచారం ఊపందుకున్న తర్వాత ఆయన నియోజకవర్గానికి వెళ్ళే అవకాశాలున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు కూడా ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ALSO READ: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. ఇంతకీ ఆపేరే ఎందుకు?

ALSO READ: కెనాల్‌లో ఒక్క నౌకే కదా చిక్కుకుందనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కథే వుంది..!