Orvakal Airport: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఏపీ సీఎం.. ఇంతకీ ఆపేరే ఎందుకు?

Orvakal Airport: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఏపీ సీఎం.. ఇంతకీ ఆపేరే ఎందుకు?
Orvakal

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు పెడుతున్నట్లు సీఎం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇంతకీ ఉయ్యాలవాడ పేరే ఎందుకు పెట్టారు? ఇదిపుడు చర్చనీయాంశంగా మారింది.

Rajesh Sharma

|

Mar 25, 2021 | 5:10 PM

Orvakal Airport named after Uyyalawada Narsimha Reddy: దేశంలో ఎన్నో ఎయిర్‌పోర్టులున్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో నెహ్రూ కుటుంబీకుల పేర్లే వున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పరంపరను కొనసాగించాయి కాబట్టి. దీనికి తొలిసారిగా బ్రేక్ వేసింది మహారాష్ట్రను గతంలో పాలించిన బీజేపీ-శివసేన ప్రభుత్వం. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఛత్రపతి శివాజీ పేరు పెట్టారక్కడ. ఇదే ఆదర్శంగా తీసుకున్నారో ఏమో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇపుడు కర్నూలు నగరానికి సమీపంలో నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు తొలి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టారు. నిజానికి ఈ డిమాండ్ కొంత కాలంగా వినిపిస్తోంది. ఏ చడీచప్పుడు లేకుండా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు పెడుతున్నట్లు సీఎం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇంతకీ ఉయ్యాలవాడ పేరే ఎందుకు పెట్టారు? ఇదిపుడు చర్చనీయాంశంగా మారింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. బ్రిటీష్ వారిని ఎదిరించిన రాయలసీమ వీరుడు. ఆ ధీరుడికి గుర్తుగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెట్టారు ఏపీ సిఎం జగన్మోహనరెడ్డి. ఫలితంగా మరోసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తీసిన సైరా నరసింహారెడ్డి సినిమా తీసినప్పుడు ఉయ్యాలవాడ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి చర్చకు రావడమే కాదు.. తెలుగు నేల ఉన్నంత వరకు ఆయన పేరునెవరు మర్చిపోలేరు కూడా. అదే ఆలోచనతో ఎయిర్ పోర్టుకు ఆ వీరుని పేరు పెట్టడం ఏ రకంగా చూసిన సమంజసంగానే కనిపిస్తోంది.

1857 నాటి ప్రధమ భారత స్వాతంత్ర్య పోరాటానికి పదేళ్ల ముందే బ్రిటిషు వారిని ఎదిరించిన ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకు ముందే చెంచులు, బోయలను కూడా కట్టుకొని బ్రిటీష్ వారి ఖజానాను కొల్లగొట్టిన యోధుడు. 1846 జూన్‌లో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి వరకు కొనసాగింది. ఉయ్యాలవాడ మరణంతో ఆనాటి పోరాటం ముగిసింది. నరసింహారెడ్డి కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వల్ల తెలుస్తోంది. ఉయ్యాలవాడ కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతిగా ఉండేవాడు. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఉయ్యాలవాడ నిర్మించిన కోటలు, ప్రాకారాలు, భద్రతా గదులు, నగరులు ఇప్పటికీ ఉన్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి – కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఇప్పటికీ ఉంది.

కీ.శ. 1565లో జ‌రిగిన‌ తళ్లికోట యుద్ధంలో ఓట‌మి త‌ర్వాత క్ర‌మంగా క్షీణించింది విజయనగర సామ్రాజ్యం. 1646 నాటికి పూర్తిగా అంతరించింది. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు అంతరించి పోయాక ప్రస్తుత రాయలసీమ ప్రాంతం నిజాం రాజుల పాలనలో కొన‌సాగింది. టిప్పు సుల్తాన్‌ పాలనా కాలంలో అనంతపురం జిల్లా రాయదుర్గం, చిత్తూరు గుర్రంకొండ కోటలపై దాడులు జరిగాయి. టిప్పు సుల్తాన్ స్వయంగా ఆ కోటలను స్వాధీనం చేసుకుని త‌న పాల‌న‌లోకి తీసుకున్నారు. కొన్నేళ్ల‌కు టిప్పు సుల్తాన్‌తో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పందం చేసుకుంది. దీని ప్ర‌కారం 1792లో నిజాం పాల‌న‌లోకి రాయ‌ల‌సీమ వ‌చ్చింది. 1799లో టిప్పు సుల్తాన్ మ‌ర‌ణం త‌ర్వాత 1800లో నిజాం పాల‌న నుంచి రాయ‌ల‌సీమను ఈస్ట్ ఇండియా కంపెనీకి దా‌ఖ‌లు ప‌రిచారు. ఈ కార‌ణంతోనే రాయ‌ల‌సీమ‌ను ద‌త్త‌ మండ‌లాలుగా పిలిచేవారు. అవే క్రమంగా పాలెగాళ్ల పాలన కిందకు వచ్చాయి.

అప్పటి రాయలసీమ ప్రాంతమంటే బళ్లారి నుంచి పశ్చిమ చిత్తూరు ప్రాంతం వరకు ఒకే జిల్లాగా ఉండేది. రాయలసీమకు థామస్ మన్రో కలెక్టరుగా ప‌నిచేశారు. బ్రిటీష్ పాల‌నా విధానంలో వ‌చ్చిన మార్పుల‌కు అనుగుణంగా రైతుల నుంచి కొత్త ప‌న్నుల వ‌సూలు విధానం అమలు చేశారు. అప్ప‌టివ‌ర‌కు రైతుల నుంచి ప‌న్నులు వ‌సూలు చేసేందుకు రాయ‌ల‌సీమ ప్రాంతంలో మ‌ధ్య‌వ‌ర్తులు ఉండేవారు. వారినే పాలెగాళ్లు అని పిలిచేవారు. విజ‌య‌న‌గ‌ర రాజుల పాల‌న‌లోనే ఈ పాలెగాళ్ల వ్య‌వ‌స్థ‌ మొదలైనట్లు చరిత్ర చెబుతోంది.

రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాండ్లు స్థానిక నాయకులుగా ఉండేవాళ్లు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. 18వ శతాబ్దపు తొలినాళ్లలో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండే వారని చరిత్ర చెబుతోంది. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటీషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు వారి ఆధీనంలోకి వెళ్ళారు. బ్రిటీషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఆలోచన చేసింది. పాలెగాళ్ల అధికారాలకు కోత వేస్తూ వారి వ్యవస్థను రద్దుచేసి నెలవారీ భరణాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది ఉయ్యాలవాడ గ్రామము. ఉయ్యాలవాడకు పాలెగానిగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవారు.

నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరపాలెగాడు పెదమల్లారెడ్డి రెండవ భార్య. నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్న కుమార్తె నీలమ్మ. నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కుమార్తె ఉంది. మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు. నొస్సం జమీందారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డికి పిల్లలు లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అణాల 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన జయరామిరెడ్డి పిల్లలు లేకుండా చనిపోయాడనే ఆలోచనతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కోసం అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపాడు. అక్కడి తాసీల్దారు అతన్ని తిట్టాడు. నరసింహారెడ్డి వస్తేనే భరణం ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు ఉయ్యాల వాడి నరసింహారెడ్డి నాయకత్వంలో ఒకటిగా చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు, స్థానిక జనాలు నరసింహారెడ్డితో చేరిన వారిలో ఉన్నారు.

1846 జూలై 10వ తేదీ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేశాడు. కోటలో ఉన్న సిబ్బందిని చంపి ఖజానాలోని 805 రూపాయల 10 అణాల 4 పైసలను దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా ఆ కూటమి దోచుకుంది. బ్రిటిషు ప్రభుత్వం ఉయ్యాలవాడను పట్టుకోవడానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు ఉయ్యాలవాడను పట్టుకోలేక వెనుదిరిగాయి. నరసింహారెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

1846 జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో బ్రిటీష్ సైన్యం వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసింది. అప్పుడు అర్ధరాత్రి తన సైన్యంతో విరుచుకుపడి వారని పారదోలాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ పోరాటంలో ఫిరంగుల‌ను సైతం వినియోగించాడు నరసింహారెడ్డి. అటు గిద్ద‌లూరు స‌మీపంలోని కొత్త‌కోట నుంచి ఇటు ఉయ్యాల‌వాడ‌, కోయిల‌కుంట్ల వ‌ర‌కు న‌ల్ల‌మ‌ల‌కు అటూ ఇటూ యుద్ధం న‌డిపారు. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం నరసింహారెడ్డి పై మరింతగా కక్ష పెంచుకుంది. ఎలాగైన అతన్ని బంధీని చేస్తేనే మిగతా వారు దారిలోకి వస్తారని అంచనా వేసింది. అందుకే ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కుటుంబాన్ని ముందుగా కడపలో జైలులో పెట్టింది. వారిని విడిపించుకునేందుకు తన అనుయాయులతో కలిసి కడప చేరాడు నరసింహారెడ్డి.

1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయానికి చేరాడు ఉయ్యాలవాడ. ఆ సంగతి తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి నరసింహారెడ్డిని బంధించారు. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టి జైలులో పెట్టారు. వారిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టగా.. 112 మందికి 14 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతరవాసం శిక్ష పడింది. కడప స్పెషల్ కమిషనర్ ఉయ్యాలవాడ కేసును విచారించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడని నిర్థారించాడు. అనేక హత్యలు, దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెప్పాడు. అంతే కాదు నరసింహారెడ్డికి ఉరిశిక్ష విధించాడు.

1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది ఆంగ్లేయ ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేసేందుకు నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు బ్రిటీష్ పాలకులు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ముగిసినా.. అది మరికొన్ని ఉద్యమాలకు ఊపిరి పోసింది. మిగతా వారిలో స్ఫూర్తి నింపింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 170వ వ‌ర్థంతి సంద‌ర్భంగా 2017లో ఓ పోస్ట‌ల్ స్టాంప్‌ను విడుద‌ల చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్ర‌ధాన‌మంత్రి మోదీ చేతుల మీదుగా ఈ స్టాంప్ విడుద‌లైంది. ఉయ్యాల‌వాడ నరసింహారెడ్డి త్యాగానికి అది గుర్తు అని చెప్పవచ్చు.

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కంటే ముందే చాలా మంది పాలెగాళ్లు తిరుగుబాటు చేశారు. అయినా అంతగా పేరు మిగతా వారికి రాలేదు. బ‌ళ్లారిలో హ‌రి నాయ‌క‌న్ వారిలో ఒకరు. అంతేగాకుండా దివాక‌ర్ నాయ‌ర్, కుద్రిత్ ఉల్లాఖాన్ వంటి అనేక మంది బ్రిటీష్ వారిని ఎదిరించి పోరారాడు. గురువ‌ప్ప నాయ‌ర్ కూడా బ్రిటీష్ కంపెనీ సైన్యానికి ఎదురుతిరిగారు. అలాంటి వారిలో కొంత‌మందిని ఉరితీసిన సైన్యం, పాలెగాండ్ర పోరాటాల‌ను అణచివేసింది. ఒకటిన్నర శ‌తాబ్దం పాటు ఆయ‌న చ‌రిత్ర పూర్తిగా జాన‌ప‌దుల పాట‌ల రూపంలో ప్ర‌చారంలో ఉంది. రేనాటి ప్రాంతంగా పిలుచుకునే నంద్యాల ప్రాంతంలో ప‌లువురు క‌ళాకారులు వివిధ పాట‌ల్లో నరసింహారెడ్డి వీర‌త్వాన్ని కీర్తించడం ఇప్పటికీ క‌నిపిస్తుంది.

ALSO READ: కరోనాను ఎదుర్కోవడంలో మనమే బెటర్.. కోటి దాటినా కంట్రోల్లోనే ఇండియా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu