పెళ్లి చూపుల్లో కరోనా వ్యాప్తి..ఒకరు మృతి, ఐదుగురికి పాజిటివ్

తెలుగు రాష్ట్రాలను కరోనా వెంటాడుతోంది. నిత్యం వందలాదిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అయినప్పటికీ చాలా చోట్ల జనాల్లో వైరస్ పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర ఫంక్షన్ల ద్వారా వైరస్ సంక్రమిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా..

పెళ్లి చూపుల్లో కరోనా వ్యాప్తి..ఒకరు మృతి, ఐదుగురికి పాజిటివ్
Follow us

|

Updated on: Jul 01, 2020 | 5:59 PM

తెలుగు రాష్ట్రాలను కరోనా పట్టిపీడిస్తోంది. నిత్యం వందలాదిగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ చాలా చోట్ల జనాల్లో వైరస్ పట్ల అదే స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర ఫంక్షన్ల ద్వారా వైరస్ సంక్రమిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చూపులకు వెళ్లిన ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన యువకుడికి ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంకు చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది. ఈ మేరకు నిశ్చితార్థం కూడా జరిపించారు.. ఐతే కొన్ని రోజుల క్రితం యువతి బంధువులు యువకుడి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. పెళ్లి కూతురు తాత, తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మ కలిసి కారులో బయల్దేరి వెళ్లారు. పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చడంతో అమ్మాయిని చూసేందుకు రావాలని ఆహ్వానించారు. అనంతరం జూన్ 19న యువకుడి కుటుంబ సభ్యులు కూడా ఎస్.యానాం గ్రామానికి వెళ్లారు. అమ్మాయి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా జరిగిన రెండు రోజుల తర్వాత వారికి సీన్ మారిపోయింది. పెళ్లింట్లో కరోనా కలవరం రేపింది.

అమ్మాయి తరపు వారు ప్రయాణించిన కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి కారులో ప్రయాణించిన అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్‌లు చేయించగా, పెళ్లి కుమార్తె తాత, తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మకు కూడా వైరస్ సోకినట్లు రిపోర్ట్స్‌లో తేలింది. చికిత్స పొందుతూనే అమ్మాయి తాత చనిపోయాడు. విషయం తెలుసుకున్న అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తమై కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు. ముందస్తుగా అంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే, దీనంతటికీ మూలకారణంగా ఉన్న కారు డ్రైవర్ అంతకు ముందు 108 అంబులెన్స్ నడిపినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది.