మైండ్‌స్పేస్‌లో కొత్తకళ…ఊపిరి పీల్చుకుంటున్న ఉద్యోగులు
ఒక కంపెనీ చేసిన తప్పిదం, వేలమంది ఉద్యోగులకు టెన్షన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ, ఆఫీస్ పరిసరాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేసింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరక్కుండా ఈ ఘటన ఐటీ ఇండస్ట్రీలో పాఠాలు నేర్పింది. ఎట్టకేలకు...
ఒక కంపెనీ చేసిన తప్పిదం, వేలమంది ఉద్యోగులకు టెన్షన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ, ఆఫీస్ పరిసరాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేసింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరక్కుండా ఈ ఘటన ఐటీ ఇండస్ట్రీలో పాఠాలు నేర్పింది. ఎట్టకేలకు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలో ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకడం తప్పని తేలడంతో ఐటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వారం రోజుల కిందట హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు వెలువడిన ప్రకటన జాతీయస్థాయిలో కలకలం రేపింది. జర్మనీ కేంద్రంగా మైండ్‌స్పేస్‌లో కార్యకలాపాలు నిర్వహించే డీఎస్ఎం అనే ఐటీ కంపెనీ చేసిన ప్రకటన ఈ దుమారానికి కారణమైంది. తమ సంస్థలోని ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని డీఎస్ఎం యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఆ కంపెనీ ఉండే మైండ్ స్పేస్‌లోని 20వ బిల్డింగ్ అంతా ఖాళీ అయింది. ఈ ప్రభావం మైండ్‌స్పేస్‌లోని ఇతర భవనాలపైనా కనిపించింది. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇచ్చాయి. పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని తేలడంతో- అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫలితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు రద్దయ్యాయి. సోమవారం నుంచి మైండ్‌స్పేస్‌లో కొత్త కళ కనిపించింది. ఉద్యోగులందరూ ఆఫీస్‌బాట పట్టారు. వారం కిందట ఉన్న కర్ఫ్యూ వాతావరణం దూరమైంది. కరోనా వచ్చిన తర్వాత ఆఫీసంటేనే భయపడిన ఉద్యోగులు.. సురక్షిత చర్యల మధ్య విధులకు యధావిధిగా హాజరవుతున్నారు.
ఇప్పుడు అందరూ బేఫికర్. ఏమీ లేదన్న భరోసాతో ఆఫీస్‌కు వస్తున్నారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. అందరిదృష్టి మైండ్‌స్పేస్‌లోని 20వ బిల్డింగ్‌లోని 9వ ఫ్లోర్‌లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మీదకు వెళ్లింది. కంపెనీ వెనకాముందు చూడకుండా తొందరపడి అధికారిక ప్రకటన చేసినందువల్ల, అన్ని ఐటీ సంస్థల మీద ఇది ప్రతికూల ప్రభావం చూపిందని తప్పుబడుతున్నారు కొందరు ఉద్యోగులు. కరోనా పాజిటివ్ అని నిర్థారణ కాకముందే హడావుడి ప్రకటనలు చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లాయని అంటున్నారు. కరోనాపై ప్రకటన- ఉద్యోగులను మానసికంగా దెబ్బతీసిందని చెబుతున్నారు.
డీఎస్ఎం కంపెనీ తొందరపాటు ప్రకటనను తెలంగాణ ఐటీ అసోసియేషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అసలు ఒక కంపెనీ.. కరోనా వైరస్‌ని ఎలా నిర్ధారిస్తుందంటూ నిలదీస్తోంది ఈ సంస్థ. కరోనా అనుమానం అని చెప్పడం వేరు, నిర్థారణ అని చెప్పడం వేరనీ, అనుమానితులు అని చెప్పొచ్చుగానీ.. కన్ఫర్మ్ అన్న మాట ఎలా చెబుతారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనా అంటూ వదంతులు వ్యాపింపజేస్తే కేసు పెడతామంటూ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామంటోంది తెలంగాణ ఐటీ అసోసియేషన్.