AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!

జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండటం, మన విలువలకు కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యం. అయితే, జీవితంలో ఎదురయ్యే ఒక్క క్షణం ప్రలోభం మనం సాధించిన మంచి పేరును, విలువలను, భవిష్యత్తును సైతం మార్చేయగలదు. ఒక చిన్న తప్పుడు ఆలోచన మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని కూడా దూరం చేయవచ్చు. దీనికి నిదర్శనంగా నిలిచే కథే జేక్ జీవితం..

Life Lesson: నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
Why Is Honesty Important
Srilakshmi C
|

Updated on: Oct 12, 2026 | 10:56 AM

Share

చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న పట్టణంలో జేక్ అనే యువకుడు నివసించేవాడు. అతని జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉండేది. ప్రతిరోజూ పని కోసం వెతుకుతూ బయటకు వెళ్లేవాడు. ఏదో ఒక చిన్న పని దొరికితే కొంత డబ్బు సంపాదించి, ఇంటికి వచ్చి భోజనం చేసుకుని నిద్రపోయేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అతను నిజాయితీని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు.ఒకరోజు రోజంతా తిరిగినా పని దొరకకపోవడంతో నిరాశగా ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో వెనుక నుంచి ఒక ముసలాయన గొంతు వినిపించింది. ‘నా సామానును మోయడానికి ఎవరైనా సహాయం చేస్తారా?’ అని ఆయన పిలిచాడు. వెనక్కి తిరిగి చూసిన జేక్‌కు మూడు పెద్ద సంచులతో ఉన్న ముసలాయన కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి సహాయం చేయడానికి అంగీకరించాడు. ‘నేను పక్క గ్రామానికి వెళ్లాలి. ఈ సంచుల్లో ఒకటి చాలా బరువుగా ఉంది. దాన్ని నువ్వు మోస్తే మూడు బంగారు నాణేలు ఇస్తాను’ అని ముసలాయన చెప్పాడు. జేక్ ఆ సంచిని భుజాన వేసుకున్నాడు. అది చాలా బరువుగా ఉండటంతో ఆశ్చర్యపోయాడు. అందులో కంచు నాణేలు ఉన్నాయని ముసలాయన చెప్పాడు. అయినప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం జేక్ సంచిని మోస్తూ ఆయనతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు.

ప్రయాణం చేస్తుండగా ముసలాయన పదేపదే జేక్‌ను గమనించడం అతనికి కనిపించింది. తనను దొంగగా అనుమానిస్తున్నాడేమోనని జేక్ భావించాడు. అయినా తన మనసులోని నిజాయితీపై అతనికి పూర్తి నమ్మకం ఉంది. కొంతదూరం వెళ్లిన తర్వాత వారు ఒక నది దగ్గరకు చేరుకున్నారు. జేక్ సులభంగా నది దాటగలిగాడు. కానీ వృద్ధుడైన ముసలాయన రెండు సంచులతో నదిని దాటలేనని చెప్పాడు. ‘నువ్వు నాకు మరో సంచి మోసేందుకు సహాయం చేస్తే ఇంకో మూడు బంగారు నాణేలు ఇస్తాను. ఈ సంచిలో వెండి నాణేలు ఉన్నాయి’ అని ఆయన అన్నాడు. అయితే రెండో సంచిని తీసుకునే ముందు జేక్ పారిపోనని మాట ఇవ్వాలని ముసలాయన కోరాడు. ఆ మాటలకు జేక్‌కు చిరాకు కలిగింది. ‘నేను దొంగను కాదు. డబ్బు కోసం ఎవరినీ మోసం చేయను’ అని స్పష్టం చేశాడు. అనంతరం రెండో సంచిని కూడా తీసుకుని నది దాటాడు.

మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత వారు ఒక కొండ దగ్గరకు చేరుకున్నారు. వయసు మీద పడటంతో కొండ ఎక్కలేకపోతున్నానని ముసలాయన చెప్పాడు. తన దగ్గరున్న మూడో సంచిని కూడా మోయాలని జేక్‌ను కోరాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయని చెప్పడంతో పాటు, జేక్ పారిపోతే తనను పట్టుకోవడం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశాడు. అప్పటివరకు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన జేక్‌కు ఈ అనుమానాలు బాధ కలిగించాయి. ‘నేను గతంలో ఒక చిన్న రుణ సంస్థలో పనిచేశాను. ఒక ఖాతాదారుడి రుణానికి సంబంధించిన రికార్డుల్లో అబద్ధం చెప్పమని అడిగినప్పుడు కూడా అంగీకరించలేదు. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను?’ అని చెప్పాడు. చివరకు ముసలాయన మూడో సంచిని కూడా అతనికి ఇచ్చాడు. జేక్ మూడు సంచులతో కొండపైకి వెళ్లి అవతలి వైపు వేచి ఉండాలని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఒక్క తప్పుడు ఆలోచన.. అంతా మారిపోయింది!

మూడు సంచులను మోస్తూ ముందుకు వెళ్తున్న జేక్ మనసులో అకస్మాత్తుగా ఒక ఆలోచన మెదిలింది. ‘ఈ మూడు సంచులతో నేను పారిపోతే ముసలాయన నన్ను పట్టుకోలేడు. ఈ డబ్బుతో నా జీవితమే మారిపోతుంది’ అని అనుకున్నాడు. ఆ ఆలోచన క్రమంగా దురాశగా మారింది. ‘ఆయన వృద్ధుడు. ఈ డబ్బు ఆయనకు ఇంకెంతకాలం ఉపయోగపడుతుంది? నేను యువకుడిని. ఈ సంపదతో ధనవంతుడిని కావచ్చు. విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు’ అని తనకు తానే సమర్థించుకున్నాడు. చివరకు తన విలువలను పక్కనపెట్టి, మూడు సంచులతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆయాసంతో ఇంటికి చేరుకున్న జేక్ ఎంతో ఉత్సాహంగా సంచులను తెరిచాడు. కానీ వాటిలో బంగారు నాణేలు, వెండి నాణేలు కనిపించలేదు. కేవలం చిన్న చిన్న రాళ్లు మాత్రమే ఉన్నాయి! తాను మోసపోయానని గ్రహించిన జేక్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఆ ముసలాయన ఎందుకిలా చేశాడని ఆలోచిస్తుండగా, ఒక సంచిలో చిన్న చీటీ కనిపించింది.

రాజు ఇచ్చిన పరీక్షలో ఓడిపోయిన జేక్

ఆ చీటీలో ఇలా రాసి ఉంది.. ‘నేను ఈ రాజ్యానికి రాజును. నాకు కుటుంబం లేదు, వారసుడు కూడా లేడు. నా తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి నిజాయితీపరుడైన వ్యక్తి కోసం వెతుకుతున్నాను. నీ ప్రవర్తనను పరీక్షించడానికి ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. నువ్వు చివరి క్షణం వరకు నిజాయితీగా ఉండి, సంచులతో పారిపోకుండా ఉంటే, నిన్ను నా కుమారుడిగా దత్తత తీసుకుని భవిష్యత్తు రాజుగా ప్రకటించేవాడిని. కానీ నీ దురాశ నిన్ను ఆ అవకాశానికి దూరం చేసింది’. ఆ మాటలు చదివిన జేక్ గుండె పగిలినంత పనైంది. జీవితమంతా నిజాయితీగా జీవించిన తాను, ఒక్క క్షణం దురాశకు లొంగి తన జీవితాన్ని మార్చగల గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. తనకు కావలసింది సంపదే అయినా, నిజానికి అతని ముందున్నది అంతకంటే గొప్ప అవకాశం. రాజ్యానికి వారసుడిగా మారే అవకాశం అతని చేతుల్లోనే ఉంది. కానీ తప్పుడు ఆలోచనకు లొంగిపోవడంతో ఆ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాడు.

జేక్ కథ మనకు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మనం ఎంతకాలం నిజాయితీగా జీవించినా, ప్రతి సందర్భంలో మన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్క క్షణం దురాశ, కోపం లేదా స్వార్థం మన విలువలకు విరుద్ధంగా ప్రవర్తించేలా చేయవచ్చు. ప్రతి చర్య వెనుక ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచనలు మాటలుగా, మాటలు చర్యలుగా, చర్యలు అలవాట్లుగా మారుతాయి. చివరకు ఆ అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే మనసులో తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు దానికి వెంటనే లొంగిపోకుండా, దాని వల్ల కలిగే పరిణామాలను ఆలోచించాలి. తాత్కాలిక ప్రయోజనం కోసం శాశ్వత విలువలను వదులుకోకూడదు. నిజాయితీ అనేది ఇతరులకు మనం చూపించే లక్షణం మాత్రమే కాదు.. ఎవరూ చూడనప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలోనే దాని అసలైన విలువ ఉంటుంది. మన ఆలోచనలు విత్తనాల వంటివి. వాటిలో నిజాయితీ, సహనం, క్రమశిక్షణ, సానుకూలత అనే విత్తనాలను నాటితే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందగలుగుతాం. దురాశ, స్వార్థం వంటి ఆలోచనలకు చోటిస్తే మనమే మన అవకాశాలను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన విలువలను కాపాడుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది మనకు లభించిన అవకాశం కాదు.. ఆ అవకాశం ఎదురైనప్పుడు మనం తీసుకున్న నిర్ణయమే!

Follow Us