TGPSC Group 1 Merit List 2025: టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి షెడ్యూల్ ఇదే!
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇటీవల జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయగా.. దానిపైనా పెద్ద చర్చే నడిచింది. అయితే ఇవేమీ పట్టించుకోని టీజీపీఎస్సీ మాత్రం గురువారం మెరిట్ లిస్ట్ సైతం విడుదల చేసింది. ఇందులోని అభ్యర్ధులందరికీ ఈ నెలలోనే ధ్రువపత్రాలపరిశీలన నిర్వహించనున్నట్లు ప్రకటించింది..

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ చుట్టూ ఓ వైపు వివాదాలు చుట్టుకుంటే.. మరోవైపు టీజీపీఎస్సీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన కమిషన్ తాజాగా గ్రూప్ 1 మెరిట్ జాబితా సైతం వెల్లడించింది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించింది. గ్రూప్ 1 పోస్టులకు ఇంటర్వ్యూలు లేకపోవడంతో నేరుగా ద్రువపత్రాల పరిశీలనకు 1:2కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచింది. దీంతో మెరిట్ లిస్టులోని అభ్యర్ధులందరికీ ఉద్యోగాలు పక్కాగా రానున్నాయి. వీరందరికీ ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ పాత క్యాంపస్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియకు ఏప్రిల్ 22వ తేదీని రిజర్వు డేగా ప్రకటించింది.
ఆయా తేదీల్లో ఎవరైనా అభ్యర్ధి ద్రువపత్రాల పరిశీలనకు హాజరుకాకున్నా, ఎవరివైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావడంలో విఫలమైనా అలాంటి వారి కోసం ఏప్రిల్ 22న అవకాశం ఇస్తారు. వీరంతా ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30లలోపు పరిశీలన కేంద్రానికి చేరుకుని తమ సర్టిఫికెట్లను సమర్పించవల్సి ఉంటుంది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ నవీన్ నికొలస్ తెలిపారు. మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పూర్తి జాబితాను వెబ్‌సైట్లో పొందుపరచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు గురువారం (ఏప్రిల్ 10) నుంచి ద్రువపత్రాల పరిశీలన కోసం అవసరమైన మెటీరియల్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను, వాటి రెండు సెట్ల జిరాక్సు ప్రతులను ఆయా తేదీల్లో తీసుకురావాలని, ఏప్రిల్ 22లోపు ధ్రువపత్రాలు తీసుకురాని వారికి మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైనా, అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా, ఆప్షన్లను నమోదు చేయని వారి స్థానంలో తదుపరి మెరిట్ అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ నవీన్ నికొలస్ వివరించారు. కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




