Work overseas: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకొనే వారికి బంపర్ ఆఫర్.. వర్క్ వీసా అక్కర్లేదు.. జాబ్ ఆఫర్ అంతకన్నా అవసరం లేదు..
జాబ్ ఆఫర్‌లు, వర్క్ వీసాలు లేకపోయినా మా దేశానికి రావచ్చంటూ కొన్ని దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఆయా దేశాలకు వెళ్లాక జాబ్ వెతుక్కోవచ్చని ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..

విదేశాలకు వెళ్లి చదువుకోవడం.. అక్కడే ఉద్యోగం చేయడం మన దేశంలో చాలా మంది యువతకు ఓ కల. అయితే ఇటీవల కాలంలో చాలా మంది ఆ కలను నిజం చేసుకొంటున్నారు కూడా. పీజీల కోసం దేశంలోని టాప్ యూనివర్సిటీలను ఎంపిక చేసుకొని, అక్కడికి వెళ్లిపోతున్నారు. అక్కడే మంచి ఉద్యోగంలో సంపాదించి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకొంటున్నారు. మరికొంత మంది మన దేశంలోనే కొన్నేళ్ల పాటు వివిధ ఉద్యోగాలు చేసి, తర్వాత విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి విదేశాల్లో జాబ్ కావాలంటే చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంత సులువుగా పని అవ్వదు. జాబ్ ఆఫర్‌లు, వర్క్ వీసాలు.. ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అయితే ఇవేమి లేకుండా సులభంగా విదేశాలకు వెళ్లే ఆప్షన్ ఉంటే ఎంత బావుంటుందో కదా? అలాంటి బంపర్ బోనాంజానే కొన్ని దేశాలు ప్రకటించాయి. వీసా, జాబ్ ఆఫర్ లేకపోయినా మా దేశానికి రావచ్చంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అంతేకాక ఆయా దేశాలకు వెళ్లాక జాబ్ వెతుక్కోవచ్చని ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఆ దేశాలేంటి? ఆ ఆఫర్ ఏంటి? చూద్దాం రండి.. ఇదెలా సాధ్యమంటారా..? అయితే.. జాబ్ సీకర్ వీసాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
జాబ్ సీకర్ వీసా..
సాధారణంగా ఒక దేశానికి వెళ్లి ఉద్యోగం చేయాలంటే అక్కడే పీజీ చేయాలి. లేదా ఏదైనా కంపెనీ ఆఫర్ లెటర్ ద్వారా జాబ్ వీసా పొందాలి. కానీ అలాంటివి ఏమి లేకుండానే ముందు ఆ దేశం వెళ్లిపోయి అక్కడ జాబ్ వెతుక్కునే వెసులుబాటును జర్మనీ, ఆస్ట్రియా, స్వీడెన్ దేశాలు అందిస్తున్నాయి అందుకోసం జాబ్ సీకర్ వీసాను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ కాలపరిమితులపై జారీ చేసే ఈ వీసాతో విదేశీయులు ఆ దేశాల్లో జాబ్ ఆఫర్ లేకపోయినా కాలుపెట్టవచ్చు. అక్కడికెళ్లాక ఉద్యోగం వెతుక్కోవచ్చు.
ఇవి ఉండాల్సిందే మరి..
అయితే ఈ జాబ్ సీకర్ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు తమ రంగాల్లో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఆయా దేశాల్లో ఖర్చులకు సరిపడా ఆర్థిక వనరులు సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా రెడీగా ఉండాలి. ఆయా దేశాల్లో గుర్తింపు పొందిన కోర్సులకు సమానమైన డిగ్రీలకే గుర్తింపు ఉంటుంది. జర్మనీలో జాబ్ సీకర్ వీసాపై 9 నెలల పాటు నివసించే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రియాలో ఆరు నెలలు, స్వీడెన్‌లో మూడు నెలలు ఉండేందుకు అనుమతి ఉంది. ఈ లోపు ఏదైనా జాబ్ ఆఫర్ వెతుక్కోవాల్సి ఉంటుంది. జాబ్ వస్తే జాబ్ వీసా మంజూరు చేస్తారు. లేకుంటే తిరిగి ఇంటికి రావాల్సిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..