Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Top Ranker: ‘మళ్లీ మళ్లీ రివిజన్‌.. ఇదే నా విజయ రహస్యం’.. గ్రూప్‌ 2 టాప్‌ ర్యాంకర్‌ హరవర్ధన్‌రెడ్డి

ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్ 2 ఫ‌లితాల్లో అత్యధికంగా స్కోర్ చేసి టాప్‌ ర్యాంకు కొట్టిన హర్ష వర్ధన్‌ రెడ్డి.. తన ప్రిపరేషన్‌ స్ట్రాటజీని పంచుకున్నారు. ప్రామాణిక పుస్తకాలను మళ్లీమళ్లీ చదివానని, సొంతంగానే ప్రిపరేషన్‌ సాగించానని అన్నారు. అయితే తన విజయ రహస్యం మాత్రం రివిజన్‌ అని తెలిపాడు. ఇంకా ఏం చెప్పాడంటే..

TGPSC Group 2 Top Ranker: 'మళ్లీ మళ్లీ రివిజన్‌.. ఇదే నా విజయ రహస్యం'.. గ్రూప్‌ 2 టాప్‌ ర్యాంకర్‌ హరవర్ధన్‌రెడ్డి
TGPSC Group 2 Top Ranker
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 13, 2025 | 3:46 PM

టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫ‌లితాలు మార్చి 11వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి జ‌న‌ర‌ల్ ర్యాంకులను కమిషన్ ప్రకటించింది. మొత్తం 4 పేపర్లకు జరిగిన గ్రూప్ 2 పరీక్షలో నారు వెంక‌ట హ‌ర‌వ‌ర్ధన్ (ఓసీ) 447.088 మార్కులతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్ష వర్ధన్‌ రెడ్డి.. ‘మళ్లీ మళ్లీ రివిజన్‌ చేయడమే తన విజయ రహస్యం’ అని అన్నాడు. ఖమ్మం జిల్లాకి చెందిన నారు వెంకట హరవర్ధన్‌రెడ్డి ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే ఇంట్లోనే పరీక్షకు సన్నద్ధమై గ్రూప్‌ 2లో సత్తా చాటాడు.

హరవర్ధన్‌రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. తండ్రి రమణారెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం ప్రస్తుతం విజయవాడలో ఉంటోంది. హరవర్ధన్‌రెడ్డి 2021లో తాడేపల్లిగూడెం నిట్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. అప్పటి నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించాడు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2021 మే నుంచి ఏడాదిపాటు ఆన్‌లైన్‌లో ఢిల్లీ నుంచి శిక్షణ తీసుకున్నాడు. 2022 డిసెంబరులో గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ రావడంతో అప్పటి నుంచి సన్నద్ధత ప్రారంభించాడు. గతేడాది వచ్చిన గ్రూప్‌ 4 ఫలితాల్లో 338వ ర్యాంకు వచ్చినా ఉద్యోగంలో చేరలేదు. ప్రామాణిక పుస్తకాలను చదివానని, రోజుకు 8 నుంచి 12 గంటలు ప్రిపరేషన్‌ సాగించినట్లు తెలిపాడు. చదివేటప్పుడు ఒకే పోటి పరీక్ష మీద శ్రద్ధ పెట్టి చదవాలని, పాత ప్రశ్నపత్రాలు అర్థం చేసుకోని చదివితే టాప్ మార్కులు వస్తాయని అన్నాడు.

తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. సివిల్స్‌లో విజయమే లక్ష్యంగా పరీక్షలకు ప్రిపేరవుతున్నట్లు తెలిపాడు. అయితే సన్నద్ధతలో తండ్రి రమణారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటానని, ఇంట్లో సొంతంగా చదివే సమయంలో అమ్మ వసుంధర ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని తెలిపాడు. రోజు క్రమం తప్పకుండా ప్రణాళికాబద్ధంగా చదివితే పోటీ పరీక్షలో విజయం సాధించడం కష్టమేం కాదని హరవర్ధన్‌రెడ్డి తెలిపారు. 2021లో బీటెక్‌ పూర్తి చేసిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమైనట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.