TG Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూ శాఖలో 10,954 జీపీఓ ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!
రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిననాటి నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్ల జారీ, నియామక పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తి చేసి అభ్యర్ధులకు నియామక పత్రాలు కూడా జారీ చేసింది. అయితే తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది...

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణలో గ్రామ పాలనను పటిష్టం చేసే దిశగా రేవంత్ సర్కార్ పలు కీలక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలన ఆఫీసర్(జీపీఓ) ఉద్యోగాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలుగా పని చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరి నుంచి ఆప్షన్లు స్వీకరించి నియామకాలు చేపట్టనున్నారు. ఇంటర్‌తో పాటు కనీసం ఐదేళ్లు వీఆర్‌వో లేదా వీఆర్‌ఏగా అనుభవం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారు విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికేట్ల ఎంక్వైరీ లాంటి విధులు నిర్వహించవల్సి ఉంటుంది.
మరోవైపు 14,236 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. వీటికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తన ప్రకటనలో వెల్లడించారు. అంతే కాకుండా నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పోస్టుల ఫలితాలు ప్రకటించిన సర్కార్.. ఎంపికైన వారికి త్వరలోనే నియామక పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీపీజీఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశ పరీక్ష తేదీలివే!
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీపీజీఈసెట్) 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, ఎం ఫార్మసి, డి ఫార్మ్ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఈ ఏడాది ఏపీపీజీఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు రూ.1200, బీసీకి రూ.900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.700 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఇక జూన్ 6, 8 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.