TS Inter Admissions 2022: ఈ రోజు నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ఈ రోజు (జులై 1) నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్ అడ్మిషన్ మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ బోర్డు..
TS Inter 1st Year Admission Schedule 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ఈ రోజు (జులై 1) నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్ అడ్మిషన్ మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ బోర్డు గురువారం (జూన్ 30) జారీ చేసింది. అడ్మిషన్ల ప్రక్రియను రెండు విడతల్లో పూర్తి చేయనున్నట్లు బోర్డు ఈ సందర్భంగా ప్రకటించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు జులై 1 నుంచి ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఆగస్టు 17 నాటికి మొదటి విడత అడ్మిషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలి. ఈ నెల 11 నుంచి తరగతులు ప్రారంభించాలి. కోర్సుల వివరాలు, ఒక్కో కోర్సులో ఉండే సీట్ల సంఖ్య, భర్తీ అయిన సీట్ల సంఖ్య, ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు యాజమాన్యాలు విధిగా తెలియజేయాలి. అన్ని కళాశాలల్లో రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు.
ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు చేపట్టాలని బోర్డు అన్ని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్లకు సూచించింది. ఐతే పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్, టీసీ సమర్పించిన తర్వాత మాత్రమే అడ్మిషన్ నిర్ధరణ అవుతుంది. అడ్మిషన్ కోసం ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేశాలు చేపట్టిన జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. ఇతర పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్ https://acadtsbie.cgg.gov.in/ లేదా https://tsbie.cgg.gov.in/లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.